రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే దమ్ముండాలి. ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్ణయం తీసుకోవాలంటే ఇంకా దమ్ముండాలి. తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలంటే ఇంకా ఇంకా దమ్ముండాలి. ఆ దమ్ము రాజన్న బిడ్డ షర్మిలమ్మలో నాకు కనిపిస్తోంది. రాజన్న రక్తంలోనే దమ్ము, ధైర్యం ఉన్నాయి. ఆ దమ్మూ, ఆ ధైర్యం షర్మిలమ్మలో నరనరాన ప్రవహిస్తున్నాయి. ప్రజాసేవే శ్వాసగా వైఎస్ఆర్ కుటుంబం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలను తమ బిడ్డల్లా చూసుకునే ఔదార్యం వైఎస్ఆర్ కుటుంబం సొంతం. ఆ లక్షణాలు రాజశేఖరుని బిడ్డ షర్మిలమ్మలో పుష్కలంగా ఉన్నాయి. “మీ కోసం నేను నిలబడతాను, మిమ్మల్ని నిలబెడతాను” అన్న షర్మిలమ్మ మాటల్లో ఆమె లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల విద్యార్ధులతో షర్మిలమ్మ నిర్వహించిన సమావేశంలో ఓ యువకుడు మాట్లాడిన మాటలు నేటి తెలంగాణ రాష్ట్ర పాలకుల తీరుకు అద్దం పడుతున్నాయి. “అక్కా నేనున్నాని చెప్పు మాకు ధైర్యంగా ఉంటుంది”అన్న ఆ యువకుడి మాటలు షర్మిలమ్మ రాకకు స్వాగతం పలుకుతున్నట్లు ఉన్నాయి. తెలంగాణ యువతకు, భవితకు షర్మిలమ్మ దివిటీల కనిపిస్తున్నారు . అందుకే..”కాబోయే సీఎం షర్మిలమ్మ” అంటూ స్టూడెంట్స్ నినదించారు.
తెలంగాణలొ రాజన్న బిడ్డ షర్మిలమ్మ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు అని తెలిసినప్పటి నుంచి కొందరు ఉలిక్కి పడుతున్నారు. కొందరు వణుకుతున్నారు. మరికొందరు బెదురుతున్నారు. కానీ..వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. షర్మిలమ్మ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడాన్ని మనసారా స్వాగతిస్తున్నారు. రాజన్న రాజ్యం రావాలంటూ లోటస్ పాండ్ పరిసరాలు అభిమానుల నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఫిబ్రవరి 9న ఉమ్మడి నల్లగొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో షర్మిలమ్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఊహించని స్పందన వచ్చింది. పేరుకి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం అయినప్పటికీ తెలంగాణ నలుమూలల నుంచి వైఎస్ఆర్ అభిమానులు లోటస్ పాండ్‌కు తరలి వచ్చారు. ఫిబ్రవరి 20న హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 10వేల మందికిపైగా వైఎస్ఆర్ అభిమానులు హాజరు అయ్యారు. షర్మిలమ్మ మాట్లాడితే వినడం కోసం, ఆమెతో ఫొటోల కోసం రాజన్న అభిమానులు కొన్ని గంటల పాటు లోటస్ పాండ్ బయట వేచిచూశారంటేనే భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు.
టీఆర్ఎస్ పాలనపై తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి వాస్తవం. ఆ అసంతృప్తి వెనుక దశాబ్దాల కలలు నిజం కాలేదనే నైరాశ్యం ఉంది. తెలంగాణ వస్తే జాబ్‌లు వస్తాయని యువత ఎదురు చూసింది. మహిళలు మహరాణులు అవుతారని ప్రచారం జరిగింది. కొలువులు వస్తాయని పోరాడారు. వందలాది మంది తెలంగాణ యువత బలవన్మరణం పొందింది భవిష్యత్తు తరాల కోసం. తమ బతుకులు పండక పోయినా, భవిష్యత్తు బాగుండాలని తెలంగాణ రావాలని కాంక్షిస్తూ వందలాది మంది నిలువునాప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత త్యాగధనుల కుటుంబాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత వరకు ఆదుకుంది..? ఎంత వరకు అండగా ఉంది..?. విద్యార్ధుల సమావేశంలో ఓ యువకుడు మాట్లాడినట్లు “ప్రాణాలు తీసుకున్న వారి శవాల మీద తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది”. ఈ మాటలు ఆ ఒక్క యువకుడివే కాదు. తెలంగాణ యువతవి. తెలంగాణ యువతలో ఉన్న నైరాశ్యాన్ని ఆ యువకుడి మాటలు కళ్లకు కడుతున్నాయి. అందుకే..షర్మిలమ్మ రాకను తెలంగాణ స్వాగతిస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శిశువుగా ఉన్నప్పుడే గొంతు నులిమి చంపేయాలని సోనియా గాంధీ, చంద్రబాబు కుట్రలు పన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు వైఎస్ఆర్ సీపీ నేతలను, కార్యకర్తలను భయాందోళనకు గురి చేశారు. ఆ సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చారు షర్మిలమ్మ. అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ అభిమానుల్లో షర్మిలమ్మ పాదయాత్ర కొండంత ధైర్యాన్నిచ్చింది. అంతేకాదు…సోనియా, చంద్రబాబుల కుట్రలను చీల్చి చెండాడింది. షర్మిలమ్మ పాదయాత్ర చేస్తున్న సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉధృతంగా ఉంది. కానీ…తెలంగాణ వాదులు ఎక్కడా అడ్డుకోలేదు. వైఎస్ఆర్ కుటుంబం మీద అభిమానంతో షర్మిలమ్మ పాదయాత్రకు ఎక్కడా అడ్డంకులు సృష్టించలేదు. షర్మిలమ్మ కూడా తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ముందుకు సాగారు.
పాదయాత్ర తరువాత షర్మిలమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా లేకపోయినప్పటికీ ఆమె వ్యూహాలను, ఆమె ఆలోచనలను తక్కువుగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆమె ఓ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడరు. వైఎస్ఆర్లో ఉన్న పట్టుదల ఆమెలో అణువణువునా కనిపిస్తోంది. వైఎస్ఆర్ బాడీ లాంగ్వేజ్ షర్మిలమ్మలో చూడొచ్చు. రాజన్న మాట తీరు, కలుపుకోలు తనం షర్మిలమ్మలో కనబడతాయి.
పాదయాత్ర సమయంలో షర్మిలమ్మ ఒక్కరోజే 23 కి.మీ నడిచి , బహిరంగ సభలో పాల్గొని, అభిమానులతో ముచ్చటించి రాత్రికి సేదతీరిన రోజులున్నాయి. షర్మిలమ్మ పాదయాత్ర సమయంలో నేను సాక్షి టీవీలో పని చేస్తూ, ఆమె పాదయాత్ర మొత్తం ఫాలో చేశాను. ఆమె అడుగులకు అక్షర రూపం ఇచ్చాను. ఆమె అడుగుల్లోని ఆరాటం నాకు తెలుసు. ఆ పాదాల్లోని పోరాటం నాకు తెలుసు. ఒక్కటనుకుంటే వెనక్కి తగ్గని నాయకురాలు షర్మిలమ్మ. రాజన్న బిడ్డ రాజకీయ పార్టీ పెడుతున్నారని తెలియగానే పాదయాత్ర స్మృతులు అలలై మనసులో ఎగిసి పడ్డాయి.
తెలంగాణలో రాజకీయ శూన్యత ఉంది అనడంలో సందేహం లేదు. టీఆర్ఎస్ బలహీన పడుతున్న కొద్దీ, బీజేపీ బలపడుతుందని అంచనాలు వేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా అదే రుజువు చేశాయి. కానీ..జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత బీజేపీ అనుకున్నంత స్పీడ్‌గా వెళ్లడం లేదు. ప్రజలు కూడా బీజేపీని అంతగా విశ్వసించడం లేదు. కాంగ్రెస్ కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. తెలంగాణ ఆకాంక్షలు టీఆర్ఎస్ నెరవేరుస్తుంది అనుకుంటే అదీ లేదు. తెలంగాణ మేమే ఇచ్చాం అని చెప్పుకునే కాంగ్రెస్ అధికారంలోకి రావడం గగనమైంది. బండి సంజయ్ వచ్చాక బీజేపీకి కాస్త ఎనర్జీ వచ్చినప్పటికీ అధికారంలోకి తీసుకురాగలిగే సత్తా ఆయనలో కనిపించడం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో షర్మిలమ్మ తెలంగాణ రాజకీయాలకు చుక్కాని అయ్యారు.
షర్మిలమ్మ రాజకీయ పార్టీ పై తెలంగాణలో పొలిటికల్ తుఫాన్ వచ్చింది. షర్మిలమ్మకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించిన వారు ఉన్నారు. అన్న మీద కోపం ఉంటే ఆంధ్రాలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో ఏం పని అన్నారు. రాజన్న బిడ్డ షర్మిలమ్మకు శారీ పెట్టి గౌరవిస్తాం కానీ..రాజకీయ పార్టీ పెడితే ఊరుకోమని మరికొందరు అన్నారు. రాజకీయ నేతల మాటలు ఇలా ఉంటే తెలంగాణ ప్రజలు, యువత, రాజన్న అభిమానులు షర్మిలమ్మ రాజకీయ పార్టీ పెట్టాలని తమ బతుకులు మార్చాలని నినదిస్తున్నారు. రాజన్న రాజ్యం షర్మిలమ్మ నాయకత్వంలోనే సాధ్యమనే నమ్మకం తెలంగాణలో రోజురోజుకు బలపడుతోంది.
ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండాలే కానీ..దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. రాజ్యాంగం ఆ వెసులు బాటు కల్పించింది. తెలంగాణ కోడలిగా షర్మిలమ్మకు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టే హక్కు సహజంగానే ఉంది. షర్మిలమ్మ తెలంగాణ ఉద్యమంలో పాల్గొందా ? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యంలో పాల్గొన్నవారే ఇప్పుడు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారా?. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారా? రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి ప్రజల విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. అంతేకానీ..విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేయడం రాజకీయ నేతలకు తగదు. తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి. కరుణానిధి పూర్వీకులు నెల్లూరు జిల్లా నుంచి తమిళనాడుకు వలస వెళ్లారు. తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత మైసూర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు. తమిళుల ప్రేము సొంతం చేసుకుని చనిపోయే వరకు అన్నా డీఎంకేకు ప్రాణంలా నిలిచారు. ఎక్కడ పుట్టినా, ఎక్కడా పెరిగినా ప్రజలకు సేవ చేయాలనే తపన, ఆ ప్రజల విశ్వాసం పొందడం, ప్రజలు ఆశించిన పాలనను అందించడం ముఖ్యం. తెలంగాణలో షర్మిలమ్మ పార్టీ నిలిచి నెగ్డడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. రోజురోజుకు కారు స్పీడ్ తగ్గుతోంది. కమలం వాడిపోతుంది. చేయి విరిగిపోతుంది. కమ్యూనిస్టులు కలలో కూడా కనిపించడం లేదు. బహుజనులను పట్టించుకున్నవారు లేకుండా పోయారు. ఆదివాసీలను అంటరాని వారయ్యరు. వీరందరికీ తోడుగా షర్మిలమ్మ అడుగులు వేయబోతున్నారు.
2018, డిసెంబర్7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లతో 88 సీట్లను గులాబీ దళం గెల్చుకుంది. 19 సీట్లను గెల్చుకున్న కాంగ్రెస్‌కు 28.4 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్లుకు తగ్గ సీట్లను కాంగ్రెస్ గెల్చుకోలేకపోయింది. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచింది. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది వైఎస్ఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా టీఆర్ఎస్కు ఓటేశారు. దీంతో టీఆర్ఎస్ ఊహించని విధంగా 88 సీట్లను గెల్చుకుంది. ఇక.. టీడీపీ 2 సీట్లను గెల్చుకుని 3.5 సీట్లను సాధించింది. తెలంగాణలో టీడీపీ పతనం 2018 నుంచి ప్రారంభమై కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 106 సీట్లలో పోటీ చేసిన టీడీపీ అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఎంఐఎం 2.7 శాతం ఓట్లతో 7 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ ఏడు స్థానాలు ఎప్పటికీ గాలిపటం ఎగురుతూనే ఉంటుంది. బీజేపీ ఏడు శాతం ఓట్లు తెచ్చుకున్నప్పటికీ ఒక్క సీటుకే పరిమితమైంది. కానీ..ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఫార్వర్డ్ బ్లాక్ 0.8 శాతం, బీఎస్పీ 2.1శాతం,సీపీఐ, సీపీఎంలకు 0.5శాతం , స్వతంత్ర అభ్యర్ధులకు 3.3 శాతం ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలకు పోను మిగిలిన పార్టీలకు 6.7 శాతం ఓట్లు వచ్చాయి. 6.7శాతం ఓట్లు అంటే మాములు విషయం కాదు. గెలుపోటములను శాసించే శాతమిది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పడిపోతుండటం, బీజేపీ ఓటు పెంచుకుంటూ ఉండటం, షర్మిల పార్టీ రెడ్డి సామాజిక వర్గం, దళితులు, బహుజనులు, ఆదివాసీలు, ముస్లింలపై దృష్టి పెడుతుండటంతో రాజకీయ సమీకరణలు తెలంగాణలో పూర్తిగా మారే అవకాశముంది. షర్మిల ఖమ్మం టూర్‌తో తెలంగాణ రాజకీయాలపై ఒక అంచనాకు రావొచ్చు. అయితే..షర్మిల టీమ్ ఇంకా స్పీడ్ పెంచాలి. ఎందుకంటే..తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు బీజేపీ గాలం వేసే పనిలో ఉంది. ఈ ఆపరేషన్‌లో భాగంగానే కుతుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ శిష్యుడు కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. ఈ వ్యూహాన్ని షర్మిల టీమ్ పసిగట్టి జాగ్రత్త పడాలి.
భేదాలు, విభేదాలు అన్నాచెల్లి సంబంధాన్ని విడదీయ లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలమ్మ రాజన్న – విజయమ్మ బిడ్డలు. షర్మిలమ్మ – వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరాల్లో రాజన్న రక్తం ప్రవహిస్తోంది.
ఆలోచనలు వేరు అయినంతా మాత్రానా గొడవలు ఉన్నాయని ప్రచారం చేయడం సమంజసం కాదు. ఎల్లో మీడియా ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే మంచిది. తానేంటో నిరూపించుకోవడానికి షర్మిలమ్మ కదిలింది. షర్మిలమ్మకు రాజన్న అభిమానులు అండగా ఉంటారు అనడంలో సందేహం లేదు. నాకు తెలిసినంతవరకు షర్మిలమ్మ పాదయాత్ర చేపడతారు. 100 నియోజకవర్గాలు కవరయ్యేలా ఈ పాదయాత్ర ఉంటుంది. ఆంధ్రాలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో, అదే స్పీడ్ తెలంగాణలో ఉండాలి అనేది షర్మిలమ్మ ఆశయం. అందుకే..తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారు. షర్మిలమ్మకు మార్గదర్శకులు తండ్రి వైఎస్ఆర్, అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు.
2023లో షర్మిలమ్మ సీఎం అయితే ఇద్దరు సీఎంల అమ్మ విజయమ్మ అని హెడ్ లైన్ పెట్టుకోవడానికి మీడియా సిద్ధంగా ఉండాలి.