కరోనా మొదలైనప్పటి నుంచీ హైదరాబాద్ కే పరిమితమై జూమ్ యాప్ లో ఊదరగొడుతున్న చంద్రబాబు మళ్లీ తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. తాను అధికారంగా ఉండగా రాయలసీమకు న్యాయం చేయడు, మరోకరు చేసేందుకు ప్రయత్నించినా సహించడు. వెన్నుపోటు రాజకీయ నేతగా విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు తాజాగా మరోసారి సీమకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్దమయ్యారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననీయదు అన్న చందంగా మొన్నటిదాకా అధికారంలో ఉండీ మొసలి కన్నీరు కార్చిన బాబు ఇప్పుడు జూమ్ మీటింగ్ లతో పెడబొబ్బలు పెడుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడడమే ఆయన లక్ష్యం. అప్పుడు రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నా అడ్డంకులు సృష్టించడమే బాబు నైజం.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రాజకీయ పార్టీలన్నీ  ఒక్కటైన పరిస్థితి. దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతుంటే ఏపిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ లాంటి పార్టీలు ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆపాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అందరూ ఐక్యం అయితే ఏపిలో ప్రభుత్వాన్ని అందరూ కలిసి ఒంటరిగా చేశారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు వెన్నుపోటు ఖాయం అనే ధోరణి బాబు కొనసాగిస్తూనే ఉన్నారు. సొంత రాష్ట్రానికి ముఖ్యంగా సొంత ప్రాంతానికి నష్టం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు వంతపాడుతూ సిపీఐ, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా అదే బాటలో నడుస్తుంటే, ఇక పచ్చమీడియా అయితే వాళ్ళు చెప్పిందే నిజం అని ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తోంది.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించే సమయంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అప్పటి వరకు ఉన్న సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

తాజాగా ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలతో చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై సాగునీటితో పాటు ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇది నచ్చని చంద్రబాబు, వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటే తమకు రాజకీయంగా పబ్బం గడవదని భావించారు. రాష్ట్రానికి ప్రయాజనం చేకూర్చే పథకాలకుఅడ్డంకులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని జగన్ మోహన రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఉత్తమ్, భట్టి, నాగం మాట్లాడడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఒక్కటే మాట్లాడితే తమని ప్రజలు తప్పుగా భావిస్తారని బి జె పీ నేతలు కూడా గళం కలిపారు. ఇప్పుడు వారికి ఏ పీ నుంచి చంద్రబాబు జత కలిశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాజెక్ట్ ని చంద్రబాబు వివాదంలోకి లాగారు. ఈ పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటూనే మరో పక్క ఆ ప్రాజెక్ట్ కు గండి కొట్టేందుకు సిద్ధం  అయ్యారు. తనతో పాటు తనకు వంతపాడే సి పీ ఐ, కాంగ్రెస్, బీజెపిలోని తన అనుకూల వర్గం నేతలను రంగంలోకి దించి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు అండ్ కో రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఎద్దు ఈనింది అంటే గాటన కట్టేయండి అన్నట్లుగా చంద్రబాబు మాటే వేదంగా నడుచుకునే పచ్చమీడియా, పార్టీలు, ఆయనకు వంతపాడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వ వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు .

ఏపి ప్రభుత్వం రాయయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మే లో ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సిఎం వారం రోజుల క్రితం వరకు నోరు మెదపలేదు. టీఆర్ఎస్ నేతలు కూడా స్పందించలేదు. రాజకీయ ప్రయోజనాలతో ఇటు చంద్రబాబు అండ్ కో, తెలంగాణాలో కాంగ్రెస్ లోని గ్రూపులు, బి జె పీ నేతలు ఇటు ఏ పీ, అటు తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తుండటంతో  స్పందించక తప్పని పరిస్థితి నెలకొనటం తో ఏ పీ చర్యలను అడ్డుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన జగన్ ను అభినందిచక పోయినా నష్టం కలిగించేలా వ్యహరించకుండా చంద్రబాబు ఉండాల్సిందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది.