ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీనుంచి లీకయిన గాస్ ప్రమాదం కారణంగా పన్నెండు మంది అభాగ్యులు అల్పాయుష్కులుగా మారిపోయారు. మరికొన్ని వందలమంది ఆసుపత్రుల పాలయ్యారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దూకి ఉపశమనచర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టి వేలాదిమందికి గాస్ ప్రమాదం నుంచి రక్షించగలిగింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాదం జరిగిన ఎనిమిది గంటల లోపే విశాఖలో పర్యటించి బాధితులకు ధైర్యం నూరిపోయడమే కాక, చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మృతులకు ఏకంగా కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించడమే కాక నాలుగురోజుల వ్యవధిలోగా వారి కుటుంబాలకు నేరుగా చెక్కులు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానిది. ఇదే సమయంలో చంద్రబాబు ఉంటే చర్యలు ఇంత వేగంగా ఉండేవి కావని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఇలాంటి ప్రమాదమే జరిగినపుడు కంపెనీవాళ్ళు నష్టపరిహారం కింద పదిలక్షలు ఇవ్వడానికి ముందుకొస్తే, చంద్రబాబు అడ్డుపడి అయిదు లక్షలు మాత్రమే ఇప్పించాడని సీపీఎం నాయకుడు నర్సింగరావు మొన్న ఒక టీవీ చర్చాకార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఇలాంటి క్లిష్టసమయంలో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు తుచ్చ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలచేత అసహ్యించుకోబడుతున్నారు.

ఇక వైసిపి రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్ గ్యాస్ లీక్ అయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి నివాసితులు భయపడకుండా వారికి అండగా నిలబడుతున్నారు. సహాయకార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలయ్యేట్లు కృషి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా, ప్రమాదకరమైన గ్యాస్ తీవ్రత పూర్తిగా అదుపులోకి వచ్చిందని, పచ్చమీడియా దుష్ప్రచారాలకు భయపడవద్దని ఓదార్చడమే కాక, ఆ ప్రాంతాల్లో స్వయంగా రాత్రివేళ బస చేస్తున్నారు. గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎస్సీ బీసీ కాలనీలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ రాత్రి నిద్ర చేశారు. అలాగే పద్మనాభపురం లో విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ గ్రామస్తుల ఇళ్లలోనే ఆరుబయట నిద్రించారు.

ఈ చర్యలతో బాధిత ప్రాంతాల్లో ప్రజలు ధైర్యంగా నిలబడి జరిగిన దుర్ఘటనను పీడకలగా మర్చిపోయి ఆపద సమయంలో నైతికమద్దతును ఇవ్వడమే కాక తమకు వ్యక్తిగతంగా అండగా నిలబడిన విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్ లను అభినందిస్తున్నారు. విశాఖ దుర్ఘటన ను రాజకీయంగా వాడుకోవాలని కుటిల యత్నాలు చేసిన ప్రతిపక్షాలకు శృంగభంగం అయిందని ప్రజలు చెప్పుకుంటున్నారు.