మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారం దొంగే దొంగ అన్న చందంగా మారింది. గురివిందగింజ తనకింద నలుపు చూసుకోదన్నట్లు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతికి పాల్పడి నిందలు మాత్రం తాజా ప్రభుత్వంపై వేస్తుంటారు. చంద్రబాబు నాయుడు ఏపీకీ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును తన స్వార్థప్రయోజనాల కోసం ఓ ఏటీఎం వాడుకున్నారు.

పోలవరం అవినీతిపై సాక్ష్యాత్ ప్రధాని నరేంద్రమోదీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి సభలో ఆరోపణలు గుప్పించారు. ‘పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు(నాటి ముఖ్యమంత్రి) ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారు. ప్రాజెక్ట్ ను అడ్డం పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు డ్రా చేస్తున్నారు’ అని విమర్శలు గుప్పించారు. అయితే నాడు మోదీ రాజకీయాల్లో భాగంగా ఆరోపణలు గుప్పించారని అందరూ భావించారు. అయితే ఆయన ఆరోపణల్లో నిజం ఉందని రాష్ట్ర ప్రభుత్వ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు సీఎం ఉన్న సమయంలో ప్రాజెక్ట్ పనుల్లో వ్యయాన్ని అమాంతం 3వేల కోట్ల రూపాయలకు పెంచడమే కాకుండా పనులన్నీంటిని తమ వారికి నేరుగా నామినేషన్ పద్ధతిలో క్యాబినెట్ ఆమోదంతో అప్పగించారు. దీనిద్వారా ఇంతవరకు ఎప్పుడూ, ఎక్కడా జరుగనటువంటి అవినీతికి చంద్రబాబు నాయుడు ద్వారాలు తెరిచారు. దీనికి 2015 అక్టోబర్లో అప్పటి రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలే అద్దం పడుతున్నాయి.

దీనిలో భాగంగా నాటి కాంట్రాక్టర్ సరిగ్గా, సక్రమంగా పనులు చేయలేకపోతున్నారని.. అందుకు ఆర్థికపరమైన అవరోధాలతోపాటు ఇంజనీరింగ్ శక్తి సామర్థ్యాలు లేకపోవడమే కారణంగా చూపించి తమవారికి నేరుగా పని కల్పించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను పరిశీలిస్తే నాడు ప్రధాని చేసిన ఆరోపణ నిజంగా నిగ్గుతేలుతుంది.

చంద్రబాబు ఆదేశాలమేరకే అధికారులు ఆ ప్రతిపాదనను రూపొందించగా క్యాబినెట్లో ఆమోదింప చేయించుకొని తమ వారికి పనులను అప్పగించారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు పనులు చేసిన ఆయనకు, ఆయనకు సంబంధించిన వారికి ఇంజనీరింగ్ సంస్థలు ఏమాత్రం పనులు చేయకపోగా ఖజానాను మాత్రం ఖాళీ చేశారు.

క్యాబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని 2015 అక్టోబర్ 13న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేయడంతో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్లకే నేరుగా పనులు అప్పగించారు. అయినా ప్రాజెక్టులో ప్రధాన పనులేవీ పూర్తికాగాపోగా ఖజానా ఖాళీ అయింది. నాడు చంద్రబాబు నాయుడి క్యాబినేట్ చేసిన తీర్మానాలే అవినీతికి ఆస్కారం కల్పించిందనే వాదనలు విన్పిస్తున్నాయి. డ్రాప్ట్ మెమోరాండం ఫర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిష్టర్స్.. పేరుతో నీటి పారుదలశాఖ (ప్రాజెక్ట్-1) సమర్పించిన నివేదికలోని అంశాలు పరిశీలిస్తే పోలవరంలో నాటి ప్రభుత్వం ఎలా అవినీతికి పాల్పడిందో అర్థమవుతుంది.

అయితే ఆ తర్వాత 2016 సెప్టెంబర్‌ 7 అర్ధరాత్రి రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయానికి చంద్రబాబు అంగీకరించారు. దాని అమలుకు సంబంధించి 2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోరాండంలోనూ 2014 ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. ఆ కేబినెట్‌లో టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి ఉన్నారు. ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంటే వారు ఎందుకు అడ్డుకోలేకపోయారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర కేబినెట్‌ తీర్మానం బ్రహ్మాండంగా ఉందంటూ 2017 మార్చి 17న అసెంబ్లీ, మండలిలో ప్రశంసించిన చంద్రబాబును కొన్ని పత్రికలు బాకాలు ఊదాయి. ఆ కేబినెట్‌ తీర్మానాన్ని ఎత్తిచూపుతూ 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టుకు నీటి పారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదిస్తే రూ.2,234.77 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల కొర్రీ వేసింది.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరుసార్లు కోరింది. దీనికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు జాప్యం చేసిన మాట వాస్తవం కాదా? 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన తీర్మానంలో సగభాగం అసెంబ్లీలో చదివిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తామని ప్రకటించిన మాట వాస్తవం కాదా? అనేది నాటి క్యాబినేట్ మంత్రులు స్పష్టం చేయాల్సి ఉంది.

శాసనమండలిలో అప్పటి ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వ్యయం అవుతుందని అంటున్నారని.. అంత డబ్బులు కేంద్రం ఇస్తుందా? అని అడిగితే చంద్రబాబు దానిని ఎగతాలి చేశారు. శాసనమండలి ప్రొసీడింగ్స్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. అంటే.. రూ.20,398 కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనం దాల్చడంతోనే పోలవరంలో ఏమేరకు అవినీతి జరుగుతుందనేది అర్థమవుతోంది.