అనంతపురం జిల్లాలో ఒకప్పుడు జేసీ బ్రదర్స్‌దే హవా. ఇటు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, అటు టీడీపీ చేరినప్పుడు కూడా తమ అధిపత్యాన్ని ప్రదర్శించేవారు జేసీ బ్రదర్స్. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ అంటే ఒంటికాలుతో ముందుకు వచ్చేవారు వీరిద్దరు. జగన్‌ను చెప్పడానికి వీల్లేని మాటలు కూడా అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి జేసీ బ్రదర్స్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వారి వ్యాపారాలను టార్గెట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. మైనింగ్, ట్రావెల్స్ ఇలా వారి వ్యాపారాలను మూయించి వేశారు. దీంతో జేసీ బ్రదర్స్ కాస్తా సైలెంట్ అయ్యారనే చెప్పాలి. తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజిక వర్గం నుంచి ఆయన కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. గతంలో నిర్వహించిన పదవి కన్నా తక్కువ స్థాయి పదవికి ఆయన పోటీ పడుతున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్‌గా నామినేషన్ వేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అదే నియోజిక వర్గం నుంచి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్దన్ కూడా పోటీకి దిగారు. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.

శాసనసభ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా వీరు ఇరువురు కుటుంబాలు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడంతో అక్కడ సాధారణ ఎన్నికల పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు జిల్లాలో అధిపత్యం చేలాయించిన జేసీ బ్రదర్స్‌ను అఖరికి వార్డు కౌన్సిలర్ స్థానానికి పోటీ చేసే పరిస్థితిని తీసుకువచ్చారు. ఈ క్రెడిట్ మొత్తం జగన్‌కే దక్కుతుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరి దీనిపై జేసీ బ్రదర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.