రాయలసీమ కరువు తీర్చేలా అపర భగరథ యత్నం చేసేందుకు ఏపీ సీఎం జగన్ నడుం బిగించారు. దశాబ్ధాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ ముఖ్యమంత్రులు మారినా.. సీమ తలరాతలు మారలేదు. అక్కడి నెర్రలు బారిన పొలాలు పచ్చబడలేదు. సీమ నుంచే పారుతున్న కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులు ఆ సీమ కన్నీళ్లను తుడవలేని దైన్యం కనిపిస్తోంది.

నాణేనికి మరోవైపు.. వానాకాలంలో భారీగా వర్షాలు పడి కృష్ణా నదీకి వరదలు వచ్చి  ఏటా 1000 టీఎంసీల వరకు నీరు సముద్రంలో వృథాగా కలుస్తోంది. ఆ నీటిని సీమకు మళ్లిస్తే సస్యశ్యామలం అవుతుంది. కానీ ఏ ఒక్క నేత ఆ దిశగా ఆలోచించలేదు. ఆచరణలో చూపలేదు.

రాయలసీమ కడగండ్లు, కష్టాలు చూసిన ఆ ప్రాంత బిడ్డగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుం బిగించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలలో ఒకటైన కాళేశ్వరంకు ధీటుగా  రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్.ఎల్.ఐ.పి– రాయలసీమ లిప్ట్ స్కీమ్)ను ఏర్పాటు చేయబోతున్నారు. సీమ కరువు తీరేలా శ్రీశైలం జలాలను మళ్లించనున్నారు. రోజుకు 3 టీఎంసీల వరకు కృష్ణా నదీ వరద జలాలను మళ్లించే ఈ అద్భుత పథకాన్ని ప్రారంభించబోతున్నారు.

ఉమ్మడి ఏపీలో కరువుతో అల్లాడే సీమ జిల్లాలకు నీళ్లందించాలని నాడు డా. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంతో పాటు హంద్రీ – నీవా, గాలేరు నగర లాంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు తోడ్పడే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపడుతున్నారు. అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చకచకా చేరుకుంది.

రాయలసీమలోనే కాదు రాష్ట్రంలోనే ఇంతపెద్ద ఎత్తపోతల పథకం ఎవరూ  నిర్మించనే లేదు. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రపంచంలోనే పెద్దదైన బహుళ, భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం 2 టిఎంసీల పంపింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఇప్పుడు మరో టిఎంసి సామర్థ్యం విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న రాయలసీమ పథకం కూడా అంతే సామర్థ్యంతో చేపడుతున్నారు. రోజుకు 3 టిఎంసీల నీటిని పంపింగ్ చేసేలా తీర్చిదిద్దారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంత పెద్ద పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మించనే లేదు.  రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆయనకు వచ్చిందే తడవుగా శాస్త్ర, సాంకేతిక-సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయించాక పని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడమే కాకుండా, శతాబ్దాలుగా కరువు వాత పడుతున్న వారిని శాశ్వతంగా ఆదుకునేందుకు సాధ్యమవుతుంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్.ఎల్.ఐ.పి– రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు 3 టిఎంసిల (34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణానది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి క్రిష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణానదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది జగన్ ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి.  మొత్తం 397 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది.

ఏపీలో ఏ సీఎం కూడా రాయలసీమ కష్టాలను పట్టించుకోలేదు. దివంగత వైఎస్ఆర్ తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం సీమ కోసం అతిపెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టారు. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ర్టంలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఏపిలో ఇదే పెద్దది అవుతుంది. ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే శ్రీశైలంలో కనీస నీటిమట్టం 243 అడుగులు ఉండాలి. డెలివరీ లెవల్ 273 అడుగుల వద్ద ఉంటుంది.  ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12 వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు. ఇలా అపర భగీరథ ప్రయత్నం నెరవేరాలని.. కరువుతో అల్లాడే సీమ పచ్చబడాలని ఆశిద్ధాం..