విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితులకి అయ్యే మొత్తం  ఆసుపత్రి ఖర్చులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చెల్లించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.దీనికి సంబంధించి గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.  దీని ద్వారా విశాఖతో పాటు గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేట్‌ ఆసుపత్రిలోనైనా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండా వైద్యసేవలు పొందవచ్చు.

ఆరోగ్య శ్రీ తో అనుసంధానం అయిన హాస్పిటల్స్‌తో పాటు, అనుసంధానం కానీ హాస్పటల్స్‌కి కూడా ఇది వర్తిస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ ఇప్పటికే అన్ని ఆసుపత్రులకు అందజేసింది. గ్యాస్‌ బాధితులకి చికిత్స అందించిన హాస్పటల్స్‌ వారికి సంబంధించిన ఆధార్‌ కార్డు, ఇతర వివరాలు తీసుకొని చికిత్స అనంతరం వైద్య సేవల బిల్లులతో సహా ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు పంపాల్సి ఉంటుంది. వారి వైద్యం కోసం ప్రభుత్వం ఎంతైనా చెల్లించనుంది. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ప్రమాదవశాత్తు లీకైన గ్యాస్‌ వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా సత్వర వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి గారు గ్యాస్‌ లీకేజీ బాధితులకి నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.