రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖ వెనుక ఉన్న లెక్కను తేల్చే పనిలో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే నిమ్మగడ్డ అదనపు పీఎస్‌గా పనిచేసిన సాంబమూర్తి నుంచి విస్తుపోయే విషయాలను రాబట్టిన సీఐడీ అధికారులు మరింత లోతైన దర్యాప్తు చేస్తోంది. రమేష్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను ఎవరో నిమ్మగడ్డకు మెయిల్ ద్వారా పంపినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో లేఖను తయారు చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ కోసం సీఐడీ ప్రయత్నిస్తోంది. ఈ కోణంలోనే కేసును దర్యాప్తు చేసి.. మరికొన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రమేష్‌ కుమార్‌ను సైతం సీఐడీ విచారించే అవకాశం ఉంది. అయితే ఆదివారం నాటి విచారణలో పీఎస్‌ సాంబమూర్తి పలు విషయాలను వెల్లడించారు. నిమ్మగడ్డ పంపిన లేఖను డౌన్ లోడ్ చేసుకుని కేంద్రానికి పంపినట్లు పీఎస్ వాంగ్మూలం ఇచ్చారు. లేఖ విషయంలో సీఐడీ ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం.

కాగా నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇటీవల డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంబమూర్తిని కొద్ది రోజుల క్రితం విచారించింది. నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ విషయంలో సాంబమూర్తి పొంతన లేని సమాధానాలు చెప్పడంతోపాటు లేఖకు సంబంధించిన అనేక ఆధారాలను నాశనం చేయడం పట్ల సీఐడీ అనుమానాలు వ్యక్తం చేసింది.

ఆ లేఖ నిజంగా నిమ్మగడ్డ స్వయంగా రాసి ఉంటే సాక్ష్యాలను నాశనం చేయాల్సిన అవసరమేంటి? సాంబమూర్తి ఎందుకు భిన్నంగా చెబుతున్నారు? అనే కోణాల్లో సీఐడీ ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే సాంబమూర్తిని హైదరాబాద్‌లో శనివారం సీఐడీ ప్రత్యేక బృందం విచారించి.. ఎన్నికల వాయిదా, కేంద్ర హోంశాఖకు లేఖ తదితర అనేక విషయాల్లో నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుపై పలు వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తోంది.