ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై అధికార పార్టీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్ర స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై మండిపడుతున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు రమేశ్ కుమార్ కు సంచలన సవాల్ విసిరారు. వారిద్దరూ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వెంటనే వారిద్దరూ ముసుగు వీడి ప్రజల్లోకి రావాలని సూచించారు.

స్థానిక ఎన్నికల వాయిదాపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీఈ రమేశ్ కుమార్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎన్నికల్లో వారిద్దరూ పోటీ చేయాలని వారిలో ఒకరు గెలిచినా.. తాను మంత్రి పదవీకి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. లేదంటే వారు పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో లేని కరోనా వైరస్ ఉందని చెప్పి.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రమేశ్ కుమార్ కు సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బదిలీలు చేయం.. ఎన్నికలను వాయిదా వేయడంతోపాటు చేసిన బదిలీలను అమలు చేయబోమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తప్పుడు నివేదికలతో చేసిన బదిలీలను ప్రభుత్వం అమలు చేయబోదని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చంద్రబాబు అడ్డు పడుతున్నారని అందుకే ఎన్నికలను వాయిదా వేయించారని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయడంతో దాదాపు రూ.5200 కోట్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.