👉 టీడీపీ హయాంలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా నిత్యకైంకర్యాలు

👉 శ్రీవారికి పది నిమిషాల్లోనే నైవేద్యాలు

👉 ప్రాచీన నవరత్నాల ఆభరణాలకు బదులు నకిలీవి

👉 రాష్ట్రవ్యాప్తంగా అర్చకుల పొట్టకొట్టిన చంద్రబాబు

👉 టీడీపీ పాలనలో కొండంతా వ్యాపారమయమే !

టీడీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు. ఎవరికి వారు స్వార్థ ప్రయోజనాల కోసం దేవస్థానాన్ని వ్యాపార వనరుగా మార్చుకున్నారు. ధనార్జనే ధ్యేయంగా శ్రీవారికి కంటి నిండా నిద్రలేకుండా చేశారని అప్పట్లో అర్చకులే ఆవేదన వ్యక్తం చేశారు. నైవేద్యాలు, కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కలియుగ వైకుంఠం తిరుమల టీడీపీ నేతల కబంద హస్తాల్లో ఏనాడో భ్రష్టు పట్టింది. టీడీపీ నేతల రాకతో ఆగమశాస్త్రాలకు స్వస్తి పలికి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. స్వామివారికి ఉపచారాలు, నిత్యపూజలు శాస్త్రప్రకారం జరగకపోవడం వల్లే నాడు రాష్ట్రంలో విపరీతమైన సంక్షోభం ఏర్పడిందనే ప్రచారం జరిగింది. ఆగమశాస్త్రం ప్రకారం తోమాల సేవ 45 నిమిషాలు నిర్వహించాల్సి ఉంటే.. వీఐపీల కోసం 10 నిమిషాల్లో ముగించాలని టీడీపీ హయాంలోని పాలకమండలి సభ్యులు ఒత్తిడి తెచ్చేవారని నాడు కొందరు అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. సహస్రనామార్చన 45 నిమిషాలు నిర్వహించాల్సి ఉంటే.. కేవలం 15 నిమిషాల్లో ముగించేశారని వెల్లడించారు.

సంప్రదాయానికి స్వస్తి..
టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీలో నాస్తిక అధికారుల పెత్తనం ఎక్కువ కావడంతో సంప్రదాయాలు, ఆగమశాస్త్రంను గాలికొదిలేశారు. స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి కనీసం గంట సమయం పడుతుంది. అయితే గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు కేవలం 10 నిమిషాల్లో ముంగించాలని ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. ఆగమశాస్త్రం ప్రకారం మొదటి నైవేద్యం వేకువజామున 5.30 గంటలకు, రెండో నైవేద్యం 11–12 గంటల మధ్య సమర్పించాలి. అయితే ఉదయం 6 గంటలకే రెండో నైవేద్యం పెట్టేలా అర్చకులపై ఒత్తిడి తెచ్చేవారు. అప్పటి నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారికి నెవేద్యం సమర్పించకుండా పస్తులు పెట్టేవారని అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలతో నాడు అర్చకులు, అధికారుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి.

ఎందుకు తవ్వకాలు జరిపినట్లు ?
2017 డిసెంబర్‌లో పోటు లోపల అంటే మొదటి ప్రాకారంలో ఉన్న వంటశాలలో చిన్నచిన్న మరమ్మతుల పేరిట 25 రోజులు పోటును మూసివేశారు. ఆ సమయంలో వేరొక చోట (బయట ప్రాకారంలో) ప్రసాదాలు తయారుచేశారు. అలా చేయడం అపవిత్రమని, అలాగే స్వామివారికి 25 రోజులునైవేద్యం సమర్పించలేదని అర్చకులు ఆందోళన వ్యక్తం చేశారు. లోపల గోడలను పగులగొట్టి, రాళ్లన్నీ తొలగించిన తవ్వకాలను చూసి అర్చకులే ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. ఆ సమయంలో ఆలయంలో క్షుద్రపూజలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వెయ్యికాళ్ల మండపం కింద వెయ్యి అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో పెద్ద భాండాగారం ఉందని, ఆలయం పోటు వద్ద పల్లవులు, చోళులు, పాండ్యులు, మరికొందరు రాజులు స్వామివారికి 18 లక్షల మొహర్లతో చేసిన కనకాభిషేకం ఆభరణాలు, మరో 18 లక్షల మొహర్లతో 9.50 అడుగుల మూలమూర్తులకు తయారు చేసిన ఆభరణాలన్నీ భాండాగారంతో పాటు ఆలయంలో రహస్య ప్రదేశంలో దాచి ఉంచిన విషయం తెలుసుకునేందుకే తవ్వకాలు జరిపారనే ప్రచారం జరిగింది. ఈ ఆభరణాల కోసమే మహాసంప్రోక్షణ పేరుతో తొమ్మిది రోజులు అనుమతి లేదని చెప్పడంతో అప్పట్లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆభరణాలు..అపహరణలు..?
టీడీపీ హయాంలో నకిలీ రత్నాలతో తయారు చేసిన ఆభరణాలను దాతల వద్ద స్వీకరించేవారనే విమర్శలు ఉన్నాయి. వాటిని దేవాలయం తరఫున బొక్కసం సిబ్బందికి చెప్పి తయారు చేయించడం, వాటిని ప్రాచీనమైన నవరత్నాల ఆభరణాలకు బదులుగా వాడడం గమనించినట్లు అర్చకులు కొందరు అనుమానం వ్యక్తం చేశారు. మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, అమ్మవార్ల విగ్రహాలకు చాలా ఆభరణాలను నకిలీ రత్నాలతో తయారు చేయించారని చెప్పుకొచ్చారు. నాడు జరిగిన బ్రహోత్సవాల్లో ప్రాచీన ఆభరణాల స్థానంలో నకిలీ రత్నాలతో తయారు చేయించిన ఆభరణాలనే వినియోగించారనే ప్రచారం కూడా జరిగింది. తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరీటాలపైనా అనుమానం ఉంది. మొదటేమో విలువైన కిరీటాలు వందల కోట్లు అన్నారు. ఆ కిరీటాలు మాయమై నెలలు అవుతున్నా బయట పడలేదు. ఆ తరువాత అతి తక్కువ విలువైన కిరీటాలు అని చెప్పి మాట మార్చారు. మాయమైన కిరీటాలు, ఆభరణాలు ఏమయ్యాయో ఇప్పటికీ వెలుగుచూడలేదు. శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు కనిపించలేదంటే కరింగించేశామని అన్నారు.

దుర్భరమైన అర్చకుల జీవితాలు..
టీడీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 34 వేల ఆలయాల్లో పని చేసిన అర్చకుల జీవితాలు దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. అంతకుముందు వరకు వంశపారపర్యంగా అరకత్వం వల్ల వచ్చిన కొద్దిపాటి వరంబడి, కొన్నివేల సంవత్సరాల ముందు వైదిక సంస్కృతి, ఆగమ సంప్రదాయాల వల్ల వచ్చే వరంబడులు.. పూజలకు వచ్చిన ప్రసాదాల్లో కొంతభాగం, భక్తులు అర్చన హారతి సమయంలో పళ్లెంలో వేసే కానుకల ద్వారా వారి జీవితాలు గడిచేవి. టీడీపీ హయాంలో తెచ్చిన చట్టంతో అర్చకులు వాటికి కూడా దూరమయ్యారు. జీతభత్యాలు కూడా లేకపోవడంతో 75 శాతం ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు దూరమై మూతబడ్డాయి. ఫలితంగా కొందరు అర్చకులు జీవన భృతి కోసం వేరే వృత్తుల్లోకి వెళ్లారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం రావడమే తరువాయి.. వైఎస్‌ఆర్‌ చేసిన చట్టాలన్నింటినీ పూర్తిగా రద్దుచేశారు. వంశపారంపర్య హక్కుల్లో అర్చకులకు పదవీ విరమణ లేదని శాస్త్రంతో పాటు సుప్రీం, హైకోర్టులు కూడా చెప్పాయి. తమ ప్రభుత్వం వచ్చాక వేతనాలు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు. అయితే ఆ ఐదేళ్లు ఏనాడు వేతనాలు ఇచ్చిన దాఖలాలు లేవు. తట్టలో పడే చిల్లర కాసులను కూడా టీడీపీ నాయకులు లాక్కెళ్లేవారని కొందరు బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

వైఎస్‌ హయాంలో హక్కుల పునరుద్ధరణ
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అర్చకుల వంశపారపర్య హక్కులు, మర్యాదలను కాపాడి, ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించి.. అన్ని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు, అర్చకుల జీవనానికి, భృతికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ హయాంలో నియమించిన పాలకమండలి, ఐఏఎస్‌ అధికారులు దేవాలయ సంప్రదాయాలను కాపాడడంతో పాటు స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలను ఆగమ శాస్త్రప్రకారం జరిగేలా కృషిచేశారు.

నిధులు పక్కదారి..
టీడీపీ హయాంలో ఆలయాలకు భక్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం నిధులను ప్రభుత్వం తీసుకెళ్తోంది. అందుకు 2014లో రూ.965 కోట్లు వస్తే రూ.900 కోట్లు డిపాజిట్‌ చేశారు. 2018–19కి వచ్చేసరికి రూ.1,600 కోట్లు పైచిలుకు వస్తే ఆ నిధులు మొత్తం తినేసి రూ.20 నుంచి రూ.30 కోట్లు మాత్రమే బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడమే ఇందుకు నిదర్శనం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీడీపీ పాలనలో టీటీడీ నిధులను వినియోగించారు. అందులో భాగంగానే అమరావతిలో ఆలయ నిర్మాణానికి రూ.152 కోట్లు, ఎక్కడో నిర్మిస్తున్న వాకింగ్‌ ట్రాక్‌లకు వినియోగించాలని నిర్ణయించారు. టీటీడీ నిధులు వారికి కావాలసిన కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడం కోసం టీటీడీ ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాన్ని కాస్త టీడీపీ తమ ఆదాయ కార్యాలయంగా మార్చుకుంది. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌ 3 పేరుతో శ్రీవారి దర్శనాలను వ్యాపారంగా మార్చుకున్నారు. నాటి పాలకమండలి సభ్యులు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, వారి పీఏలు, పీఆర్వోలు ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందలాది మంది టీడీపీ నేతలు స్వామి దర్శన టికెట్లు, గదులు, తిరుమలలో దుకాణాలు, తట్టలను అమ్మి సొమ్ముచేసుకున్న విషయం భక్తులు ఇంకా మరచిపోలేదు.