‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగింది లేదా?’ అన్నట్టుగా ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు.. మంత్రి పదవి చేపట్టామా? లేదా అన్నట్టుగా ఉత్తరాంధ్ర సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయం సాగేది.. గడిచిన నాలుగైదు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ చేరి మంత్రిగా అధికారం అనుభవిస్తున్న టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు అంచనా ఈసారి తప్పింది.

గంటా శ్రీనివాసరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీచేసి గెలిచాడు. కానీ పార్టీ మాత్రం ఓడిపోయింది. దీంతో ఈసారి అధికారానికి దూరంగా ఉన్నారు. కానీ దాన్ని భరించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. గంటా టీడీపీలో ఇమడలేక.. వైసీపీలో చేరలేక సతమతమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు గంటా గారి ట్రాక్ రికార్డ్ చూసి ఏకంగా జనసేన నో చెప్పిందని.. బీజేపీ తలుపులు మూసిందని ప్రచారం సాగుతోంది..

ప్రతీసారి నియోజకవర్గాన్ని మార్చేస్తూ గంటా గెలుస్తుంటారు. మంత్రి పదవి కొల్లగొడుతారు. ఒక్కసారి గెలిచిన నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ కనిపించదు కాబట్టి. వెనక్కి తిరిగి చూస్తే అవినీతి అక్రమాలు.. కబ్జాలు.. దోపిడీలు తప్ప ఏమీ ఉండవనే ప్రచారం ఉంది. అందుకే ఒకసారి గెలిచిన నియోజకవర్గంలో మరోసారి ఆయన పోటీచేయరనే ప్రచారం ఉంది.

గత టీడీపీ ప్రభుత్వంలో గంటా మంత్రిగా ఉత్తరాంధ్రను ఏలారు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో ఆరపణలు వచ్చాయి. గంటా ఒక శక్తిగా మారారనే టాక్ ఉంది. గంటా అండ్ గ్యాంగ్‌ను చూసే గత ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రాలేదని సమాచారం. నిజాయతీగా వ్యాపారం చేయాలనుకునేవారు… కంపెనీలు నడపాలనుకునేవారికి ఈ గంటా స్పెషల్ ట్యాక్స్ ఒక పెద్ద అడ్డంకిగా భావించారని పలువురు చెబుతున్నారు.

శాండ్, మైనింగ్ లాబీలకు మేలు చేయడం… వారి నుంచి కమీషన్లు దండుకోవడం కూడా గంటాకు హాబీ అని ఆరోపణలున్నాయి. అందుకే ఆయన అధికార పార్టీవైపే ఎప్పుడూ చూస్తుంటారని తెలుస్తోంది. తమవాడు అధికార పార్టీలో ఉంటే ఆ లాబీలకు ఒక రకమైన ధైర్యమని ఆయన భావిస్తుంటారని ఆయన అనుయాయులు అంటుంటారు. అలాంటి గంటా అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై నానా వాగుడు వాగాడు. దాన్ని వైసీపీ కార్యకర్తలు తట్టుకోలేక నిరసనలకు దిగారు. కానీ ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి మళ్లీ వైసీపీలో చేరేందుకు ఉబలాటపడుతున్నాడు. గంటాగారి ఎన్నో ఆరోపణలున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని చూస్తే..

2009 ఎన్నికల్లో ఓటర్లకు లంచాలిచ్చాడన్న కేసులో అనకాపల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు రాజకీయ వర్గాల్లో అంటుంటారు. గంటాకు అనకాపల్లి సెకండ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఐపీసీ 171(E) కింద పోలీసులు కేసు నమోదైనట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అదే 2009లో గంటా శ్రీనివాసరావుపై అనకాపల్లిలోనే హత్యాయత్నం కేసు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. Cr.No.15/2009 కేసు అది. సెక్షన్ 307, 332 ఐపీసీ కింద తీవ్రంగా గాయపరచడం, హత్యాయత్నం చేయడంపై ఈ కేసు నమోదైనట్లు తెలిసింది. అయితే దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం ఈ కేసును ఎత్తివేస్తూ జీవో తెచ్చింది. అచ్చెన్నాయుడిపై ఉన్న లైంగిక వేధింపుల కేసు సహా 23 మంది టీడీపీ నాయకులపై కేసులు ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిస్సిగ్గుగా జీవో తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో టాక్‌.

గంటా శ్రీనివాసరావు మాజీ పీఏ క్రాంతి కిరణ్‌పై 2016, నవంబర్‌‌ 6న ఏసీబీ దాడులు చేసి ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించింది. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఉన్న రూ.15 కోట్ల ఆస్తులను గుర్తించి కేసు పెట్టింది. డీఈఓ పోస్టుల నియామకంలోనూ అవినీతి అక్రమాల వల్ల… అప్పటి పర్సనల్ సెక్రటరీలు ఎంఆర్జీ నాయుడు, బాల స్వామిపై ఆరోపణలు వెల్లువెత్తి… మాజీ సీఎం చంద్రబాబు ఎంక్వయిరీ కమిటీలు వేయాల్సి వచ్చిందని అనుకుంటున్నారు.

డాల్ఫిన్ నోస్ హిల్స్, రెడ్ శాండ్ డ్యూన్స్ కూడా గంటా శ్రీనివాస్ అండ్ కో కబ్జా చేసిందని.. అలాంటి వ్యక్తికి జనసేనలో చోటు లేదని పవన్ కల్యాణే చెప్పేశాడంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చనే టాక్ ఉంది. విశాఖపట్నంలోని ద్వారకానగర్‌‌లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు కాంప్లెక్స్ ను జీవీఎంసీ అధికారులు కూల్చివేయగా.. భీమిలిలో లీజుకు తీసుకున్న భూమిలో అక్రమంగా నిర్మించిన గంటా గెస్ట్ హౌస్ ను కూల్చేసేందుకు నోటీసులిస్తే హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నట్లు సమాచారం.

2018 అక్టోబర్‌‌లో విశాఖలోని తిమ్మాపురం జంక్షన్ దగ్గర దివంగత వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అప్పటి ప్రతిపక్ష నేత జగ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రయత్నించగా.. దాన్ని అడ్డుకోవడమే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావే అరెస్టు చేయించాడనే ప్రచారం అప్పట్లో బాగా సాగింది.. తన పీఏలు, ఓఎస్డీలతోనూ అవినీతి చేయించి.. బినామీలుగా మార్చుకున్నారని ప్రధాన ఆరోపణలు. అధికారానికి, డబ్బుకు తప్ప ఏ పార్టీకి, ఏ నాయకునికీ విధేయునిగా ఉండని తత్వం గంటాది అని ఇప్పుడు విశాఖలో.. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వైసీపీలో గంటాను చేర్చుకోవద్దంటూ క్యాంపెయిన్ సాగుతోంది.