లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో భక్తులకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం శ్రీవారి ఆలయంలో అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. క్యూలైన్‌ కదలికను గుర్తించేందుకు గంటకు ఎంత మందిని దర్శనానికి పంపగలుగుతామనే అంశంపై పరిశీలించారు. వందమంది టీటీడీ ఉద్యోగులతో ట్రయల్‌ రన్‌ నిర్వహించగా, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి గారు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారు పరిశీలించారు.

వైవీ సుబ్బా రెడ్డి గారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 8,9,10 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో శ్రీవారి దర్శనాలు ట్రయన్‌ రన్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. రోజుకు 7వేల మందికి దర్శనం కల్పించడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను భక్తులు తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని కోరారు. టీటీడీ చర్యలకు భక్తులు సహకరించాలన్నారు. తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, కల్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని తెలిపారు. అన్న ప్రసాద కేంద్రం వద్ద చేతులు శుభ్రపరుచుకునే ప్రాంతంలో భక్తులు జాగ్రత్త వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు తీర్థం చఠారి రద్దు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.