అమరావతి: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రాథమిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు బుధవారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలకశాఖ కమిషనర్లు, అధికారులు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈనెల 7న ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకారం ఇప్పటికే అత్యధిక జిల్లాల్లోని పంచాయతీ, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ నివేదికలను సిద్ధం చేశారు. మిగతా జిల్లాల్లోనూ సీఎంతో స్పందన కార్యక్రమం ముగిశాక కలెక్టర్లు మంగళవారం సాయంత్రం అధికారులతో సమావేశమై తదుపరి చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రానికి 13 జిల్లాల్లోని రిజర్వేషన్లపై కసరత్తు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాక… ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి, వార్డు సభ్యులు, పురపాలక, నగర పాలక సంస్థల్లో వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టర్లు ఖరారు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు.

జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, నగరపాలక, పురపాలక సంఘాల్లో మేయరు, ఛైర్‌పర్సన్‌ స్థానాలకు రాష్ట్రం యూనిట్‌గా సంబంధిత ప్రభుత్వశాఖల కమిషనర్లు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ వివరాలను గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారులు అందజేయనున్నారు. వీటిపై సమీక్షించి శుక్రవారం కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు, పురపాలక, పంచాయతీరాజ్‌ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనరు సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. ఆ తర్వాత 7న పంచాయతీ, పురపాలక ఎన్నికల షెడ్యూలును జారీ చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతోపాటు పురపాలక ఎన్నికలను ఏకకాలంగా నిర్వహించి రెండో విడతలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నింటినీ కలిపి ఒకేసారి నిర్వహించి నెలాఖరులోగా పూర్తి చేస్తారా? అనే దానిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

ఆర్డినెన్సా… జీవోనా?

రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలని ప్రభుత్వం మొదట భావించినా న్యాయనిపుణుల సలహాపై జీవో ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 59.85 శాతం రిజర్వేషన్లతో జారీ చేసిన జీవోను (176) హైకోర్టు రద్దు చేసినందున.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ (రిఫరెన్స్‌) రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. బుధవారం మంత్రి మండలి సమావేశం ప్రారంభమయ్యేలోగా ఆర్డినెన్సా, జీవోనా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని న్యాయ వ్యవహారాలు చూసే ఉన్నతాధికారుల అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది.

ఎన్నికల నిర్వహణకు సచివాలయ ఉద్యోగులు పంచాయతీ, పురపాలక ఎన్నికల నిర్వహణ కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ సచివాలయాల వారీగా పని చేస్తున్న గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో బుధవారం నాటి సమావేశం సందర్భంగా ఈ అంశంపైనా పంచాయతీరాజ్‌, పురపాలక కమిషనర్లు చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
వీటికే ఎన్నికలు

రాష్ట్రంలో 13,365 గ్రామ పంచాయతీలు, 10,336 మండల పరిషత్తులు, (ఎంపీటీసీ), 660 జిల్లా పరిషత్తు ప్రాదేశిక స్థానాలకు (జెడ్పీటీసీ), 102 పురపాలక, నగరపాలక, నగర పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. షెడ్యూలు ప్రకటించే నాటికి వీటి సంఖ్య అటుఇటుగా తగ్గొచ్చు.. పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
* గత రెండున్నర నెలల వ్యవధిలో చేపట్టిన గ్రామ పంచాయతీల పునర్విభనతో రాష్ట్రంలో కొత్తగా సుమారు 300 గ్రామ పంచాయతీలు ఏర్పాటైనట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
* కొత్తగా ఏర్పాటైన మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలతో (ఎంపీటీసీ) కలిపి మొత్తం 10,336 స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
* రాష్ట్రంలో 2 నగరపాలక సంస్థలు, మరో 6 పురపాలక, నగర పంచాయతీలకు మినహా 102 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒక నగర పాలక సంస్థ విషయంలో కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. కాకినాడ నగర పాలక సంస్థకు ఇప్పటికే పాలకవర్గం ఉన్నందున వీటిలో ఎన్నికలు ఉండవు. మరో 6 పురపాలక, నగర పంచాయతీలపైనా కేసులు కోర్టుల్లో ఉన్నందున మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహిస్తారు.