ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా సాగుతున్న జగన్ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పోరు ఇవాళ మరో కీలక మలుపు తిరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం .. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న తనపై మంత్రులు, ప్రభుత్వ పెద్దలు.. సలహాదారులు చేస్తున్న విమర్శలపై నిమ్మగడ్డ రమేశ్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ బద్ధంగా తనపని తాను చేసుకుంటూ పోతుంటే.. ప్రభుత్వ పెద్దలు తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలని ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ప్రభుత్వ పెద్దల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తనకు సహకరిస్తున్నట్లుగా నటిస్తూ.. మరోవైపు కత్తులు దూస్తుందని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అధికారులు తనకు సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఆదేశాలు పాటించడం లేదని.. మంత్రులు, సలహాదారులు తనపై రోజూ బహిరంగ విమర్శలకు దిగుతుండడంపై నిమ్మగడ్డ సీరియస్ అవుతున్నారు. ఏదో ఒకరకంగా వీరి విమర్శలకు అడ్డుకట్ట వేయాలని నిమ్మగడ్డ ఆలోచన వేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం గవర్నర్ హరిచందన్ కు లేఖ రాశారు.

పంచాయతీ ఎన్నికల విషయంలో తనను రోజూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ చేస్తున్నారని గవర్నరుకు ఫిర్యాదు చేశారు. సజ్జల ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ.. పార్టీ ఆఫీసు నుంచి తనపై విమర్శలు చేస్తున్నారని ఎస్ఈసీ ఆరోపించారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ.. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. సుప్రీంలో కేవియెట్ వేసిన తనకు వ్యతిరేకంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని గవర్నర్ ఎదుట తన గోడు వెల్లబోసుకున్నారు. సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీలో పంచాయతీ కోడు అమలులో ఉన్నా.. ఏకంగా ఎన్నికలు నిర్వహిస్తున్న తనపైనే నిత్యం మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మంత్రుల విమర్శలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని గవర్నరుతో చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.