స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార వైసీపీ పార్టీలోకి వలసలు భారీగా పెరిగాయి. ఒక్క మంగళవారమే దాదాపు 10 మంది నాయకులు వరకు వైసీపీ పార్టీలో చేరారు. టీడీపీ , జనసేన పార్టీ నాయకులు జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం విశేషం. లోకల్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలోకి ఇలా పలువురు నాయకులు చేరడంతో వైసీపీ క్యాడర్ ఆనందంలో మునిగి తేలుతుంది. అయితే మంగళవారం పార్టీలో చేరిన నాయకుల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు కూడా వైసీపీలో చేరడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. ప్రకాశం జిల్లా నేతల్లో కదిరి బాబురావు కూడా ఒకరు. ఆయన మొదట నుంచి నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చేవారు. బాలకృష్ణతో అయితే మరింత చనువుతో ఉండేవారు కదిరి. అసెంబ్లీలో కూడా బాలయ్య, కదిరి బాబురావు పక్క పక్కనే కూర్చునేవారు. మరి అలాంటి సన్నిహితుడు కూడా వైసీపీలో చేరడం అందరిని ఆశ్చర్యం కలుగించింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే టీడీపీ నాయకుల్లో కదిరి బాబురావు కూడా ఒకరు. బాలయ్యతో మంచి సత్ససంబంధాలు కొనసాగిస్తుంటారాయాన. బాలయ్య కూడా కదిరి బాబురావు మీద తన అభిమానాన్ని చూపిస్తుంటారు. ఆయనకు రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ఇప్పించారు బాలయ్య. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కాని , సడన్‌గా కదిరి బాబురావు వైసీపీలో చేరి అందరికి షాక్ ఇచ్చారు. అయితే కదిరి ఇలా వైసీపీలో చేరడం వెనుక బాలయ్య హస్తాం కూడా ఉందని తెలుస్తోంది. బాలయ్య పర్మిషన్ తీసుకొనే ఆయన వైసీపీలో చేరారని తెలుస్తోంది. పార్టీ మార్పుపై బాలయ్యతో చర్చించిన తరువాతే కదిరి బాబురావు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

కదిరి బాబూ రావు 2014 ఎన్నికల్లో కనిగిరి నుండి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సైతం ఆయనకు టీడీపీ టిక్కెట్ దక్కినా..నామినేషన్ లో సాంకేతిక సమస్యల కారణంగా అది తిరస్కరణకు గురైంది. సమయం మించి పోవటంతో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే, తిరిగి బాలకృష్ణ సిఫార్సుతో 2014 ఎన్నికల్లో కనిగిరి నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి మధుసూధనరావు పైన 7207 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కనిగిరి నుండే తిరిగి అవకాశం ఇవ్వాలని మొర పెట్టుకున్నా..పార్టీ అధినేత చంద్రబాబు కనిగిరి సీటును మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహా రెడ్డికి కేటాయించారు. బాబూరావును దర్శి నుండి బరిలోకి దింపారు. అప్పుడు కూడా బాలకృష్ణ చెప్పటంతో కాదనలేక బాబురావు పోటీకి దిగారు. అయితే, ఆయన ఓడిపోయారు. దీంతో..అప్పటి నుండి ఆయన పార్టీలో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

రాష్ట్రంలో జగన్ చేస్తున్న అభివృద్దిని చూసే వైసీపీలో చేరానని కదిరి తెలిపారు. పైగా ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకి మరింత దిగజారుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ఆయన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తన మొదట ఓటు టీడీపీ వేశానని, టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నానని బాబూరావు తెలిపారు. తనను కనిగిరి నుంచి ఎందుకు తప్పించారని చంద్రబాబును ప్రశ్నిస్తే.. కులాల గురించి మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు.తనకు బాలకృష్ణను విడిచి వెళ్లాలంటే బాధగా ఉందని కదిరి బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. బాలయ్య చాలా మంచివారని చెప్పారు. ఎన్టీఆర్, బాలకృష్ణల వ్యక్తిత్వం వేరని.. నారా వారి వ్యక్తిత్వాలు వేరని అన్నారు. చంద్రబాబు ఏదో ఒకరోజు బాలయ్యను కూడా మోసం చేస్తారని కదిరి చెప్పుకొచ్చారు. తాను వైసీపీలోకి వెళ్తున్నా అని బాలకృష్ణకు చెప్పే వచ్చానని కదిరి చెప్పడం కొసమెరపు. ఏది ఏమైనప్పటికి కూడా ఎన్నికల సమయంలో పార్టీలోకి భారీగా వలసలు పెరగడం వైసీపీకి లాభామే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.