ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్. షర్మిల కొత్త రాజకీయ పార్టీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత కొద్దిరోజులుగా చర్చకు వస్తున్న ఈ అంశంపై షర్మిలమ్మ క్లారిటీ ఇచ్చినా.. అంతకు మించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కొందరు నేతలు అంటున్నారు. ఇప్పటికే పార్టీ రిజిష్టర్ చేశారని.. తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ సన్నిహితులతో మంతనాలు కూడా పూర్తయ్యాయనే ఊహాగానాలు జోరుగా చర్చ జరుగుతున్నాయి. అయితే మొదట 2014లో జరిగిన ఎన్నికల్లలో షర్మిలమ్మను ఎంపీగా నిలబెట్టాలని అనుకున్నా.. భవిష్యత్తును ఆలోచించిన వైఎస్ జగన్ ప్రత్యేక వ్యూహంతో అంతర్గతంగా పావులు కదుపుతున్నారని పలువురు అంటున్నారు. ఈ మేరకు 2024 ఎన్నికలే లక్ష్యంగా పథకం రచిస్తున్నారని భావిస్తున్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జగన్ కు వెన్నంటి నిలిచారు షర్మిలమ్మ. తాను జగనన్న బాణాన్ని అంటూ.. ప్రజల్లోకి వెళ్లారు. పాదయాత్రతో అందరికీ దగ్గరయ్యారు. ప్రజల కష్టాలు తెలుసుకుని రాజన్న రాజ్యం వస్తోంది.. జగనన్న మీ కష్టాలు తీరుస్తారని జోరుగా ప్రచారం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన షర్మిలమ్మ.. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తనవంతు పాత్ర పోషించారని చెప్పవచ్చు. 2019 ఎన్నికల ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న షర్మిలమ్మ.. చంద్రబాబు… అతడి కొడుకు లోకేష్ పై వ్యంగ్యస్త్రాలతో ప్రచారంలో ఉత్సాహం నింపారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతీచోట ప్రజలు నీరాజనం పలికాపరు. తరువాత అఖండ విజయంతో వైసీపీ అధికారంలో వచ్చింది. వైఎస్. జగన్ సీఎం అయ్యారు.

ఈ క్రమంలో ఓ ప్రతికలో వచ్చిన కథనాలు వైఎస్ జగన్ మనసులో ఉన్న ఆలోచనకు మరింత ఆజ్యం పోసినట్లు తెలిసింది. జాతీయ పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటికీ… కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మాత్రమే.. తన రాజకీయ సేవలు పరిమితం కావొద్దని ఆలోచిస్తున్న జగన్.. రాజన్న రాజ్యాన్ని రెండు తెలుగు రాష్ర్టాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో ఆదరణ పొందుతున్న వైసీపీ కాకుండా షర్మిలమ్మ నేతృత్వంలో మరో రాజకీయ పార్టీ పెట్టి.. అనుబంధ పార్టీగా ముందుకు సాగించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఇప్పటికే షర్మిలమ్మ.. తల్లి విజయమ్మతో చర్చించి.. వారి నిర్ణయం అనంతరం 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పాలనలో అతిచిన్న వయసులో వైఎస్ జగన్ మెహన్ రెడ్డి.. ఎంతో పేరు సంపాదించారు. జాతీయస్థాయిలో నంబర్ వన్ గా ఖ్యాతి పొందారు. జగనన్న పాలన ఒక్క తెలుగు రాష్ట్రానికే పరిమితం కాకూడదని తెలంగాణ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ తో ఉన్న అనుబంధం.. కేసీఆర్ తో కొనసాగుతున్న స్నేహబంధం.. అక్కడ తమ పార్టీ నేతలు పోటీ చేయకుండా అడ్డు పడుతోంది. ఈ క్రమంలో.. షర్మిలమ్మ ద్వారా.. తెలంగాణలో రాజన్న రాజ్యం పేరిట పార్టీ నెలకొల్పి.. పాలనను కొనసాగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే తెలంగాణలో ఉన్న వైఎస్సార్ అభిమానులతో చర్చించినట్లు తెలిసింది. ఏది ఏమైనా.. ఏపీలో సుభిక్షమైన పాలన అందిస్తున్న జగన్ తెలంగాణపై కూడా మనసు పెట్టడం సంతోషకరమైన వార్త అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్నారు.