నిలబడి నీళ్లు తాగడం కన్నా.. పరిగెత్తి పాలు తాగడమే బెటర్ అని చంద్రబాబు భావిస్తుంటారని పొలిటికల్ వర్గాల్లో ఓ సెటైర్ ఉంది. ఉమ్మడి ఏపీ విడిపోయాక కట్టుబట్టలతో మిగిలిన ఏపీ రాష్ట్రానికి అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన విశాఖను రాజధాని చేస్తే ఇప్పుడీ పంచాయతీ అంతా ఉండేది కాదు.. కానీ విశాఖను రాజధాని చేస్తే చంద్రబాబు ఎలా అవుతారు.. కాదు కదా అందుకే అమరావతిని తెరపైకి తెచ్చారని ప్రచారం సాగుతోంది.

నిజానికి విశాఖపట్నానికి రాజధానికి కావాల్సిన అన్ని హంగులున్నాయి. ఎయిర్ పోర్టు, అంతర్జాతీయ పరిశ్రమలు, స్టేడియాలు, మౌళిక వసతులున్నాయి. చంద్రబాబు రాజధానిగా ప్రకటించి పాలిస్తే అయిపోయే ముచ్చట.. కానీ చంద్రబాబు, ఆయన అనుయాయులు రాజధాని పేరిట రాజకీయం చేశారు. కొత్త రాజధానితో కోట్లు కొల్లగొట్టవచ్చని ప్లాన్ చేశారనే విమర్శలున్నాయి. రియల్ భూము తీసుకొచ్చి ముందే భూములు కొని లాభపడవచ్చని పచ్చ బ్యాచ్ ప్లాన్ అని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ అఖండ మెజార్టీతో చంద్రబాబును ఓడించి 2019లో గద్దెనెక్కగానే సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు కేబినెట్ లో ప్రాధాన్యం ఇస్తూ బీసీలకు పెద్ద పీట వేశారు. ఇక కుల సమీకరణాలకు అనుగుణంగా అణగారిన వర్గాలకు న్యాయం చేస్తున్నారు.

ఈ క్రమంలో పాలనలో తనదైన మార్పులు, చేర్పులు చేశారు. ఇన్నాళ్లు అమరావతి రాజధానిగా సాగించిన ఏపీ పాలనను ఇక నుంచి విశాఖపట్నానికి ఇనుమడింప చేయాలని జగన్ యోచించారు. విశాఖను ఏపీకి పరిపాలన రాజధానిగా ప్రకటించారు. జగన్ గెలుపులో ఉత్తరాంధ్ర ప్రాముఖ్యత వెలకట్టలేనిది. గోదావరి జిల్లాలు, విశాఖ, ఉత్తరాంధ్రలో ప్రజలు ఆదరించారు. అందుకే పాలనను వారికి చేరువ చేయడానికి జగన్ ఏపీకి పరిపాలన రాజధాని అన్ని మౌలిక వసతులున్న విశాఖను చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. మహారాష్ట్ర తరహాలోనే ముంబైతోపాటు ఫుణె, నాగపూర్ లకు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే ఏపీలో అమరావతితోపాటు విశాఖకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలిసింది.

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఎక్కడ ఉంటుందో గుర్తించే పని తాజాగా ప్రారంభమైంది. రాజధాని ఎక్కడ ఉంటుందో డిసైడ్ చేయడం.. రూపకల్పన చేయడం, ప్రణాళిక చేయడం, నిర్మించడం మరియు నిర్వహించడంపై దృష్టి సారించే అహ్మదాబాద్‌లోని సిఇపిటి విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బిమాన్ పటేల్, గత వారం వైజాగ్‌ను సందర్శించారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాలను పరిశీలించారు. ప్రధాన రాజధాని ప్రాంతం కైలాసాగిరి కొండలు మరియు భోగాపురం మధ్య ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం. రాజధాని ముఖ్య కూడలి ప్రాంతం వైజాగ్ నగరం నడిబొడ్డుకు దూరంగా ఉంటుందని తేల్చారు. ఒక వైపు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మరియు మరొక వైపు బెంగాల్ బే ఉంటుంది.

బావికొండ, తోట్లకొండ, కంబలకొండ మరియు గ్రేహౌండ్స్ యాంటీ నక్సల్ స్ట్రైక్ ఫోర్స్ మరియు రామానాయుడు స్టూడియోలు ఉన్న కొండలతో సహా ఐదు కొండల చుట్టూ రాజధానిని అభివృద్ధి చేయాలనే ఆలోచనను ఈ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించారు. ఈ కొండలలో కొన్ని భవనాలు మరియు స్థలాలపై పరిమితులు ఉంటాయి. దీంతో ఇక్కడ భవన నిర్మాణాలు వాస్తుశిల్పులు దాని చుట్టూ పనిచేయడం సవాలుగా ఉంటుంది. అయితే ఆహ్లాదకర ప్రాంతం కావడంతో ఇదే బెటర్ అని తేల్చారు. పైగా భూములన్నీ ప్రభుత్వం పరిధిలోనే ఉండడం ప్లస్ అవుతుంది.

కొండలు, గుట్టలు పచ్చని వాతావరణం మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఏపీ కొత్త రాజధాని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అవుతుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి కోసం ఇప్పటికే వేల కోట్లు ఖర్చు బెట్టారు. ఆ విలాసవంతమైన బడ్జెట్ ఎవరికి పోయిందో అందరికీ తెలుసు. అయితే వైజాగ్ రాజధాని అన్ని మౌళిక వసతులు ఉన్న నగరం. కాంక్రీట్ ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తయారు చేశారు. విశాఖపట్నంపై అధికారిక పనులు ప్రారంభించే ముందు రాజధానుల వికేంద్రీకరణపై బిల్లును శాసనసభ ఆమోదించే వరకు ప్రభుత్వం వేచి ఉండాలని చూస్తోంది. రాజధాని బిల్లు ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందగానే విశాఖ నుంచే ఏపీని పాలించడానికి జగన్ రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో విశాఖలో రాజధాని ఎక్కడ పెట్టాలన్నది దాదాపు జగన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల యూనివర్సిటీ కమిటీ తేల్చినట్టు తెలుస్తోంది.