టీడీపీకి వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ , తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా ఓడిపోయి నిస్సహాయస్థితిలో ఉండిపోయింది. మొదట పంచాయితీ ఎన్నికలపై టీడీప చాలానే ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసివస్తుందని భావించారు టీడీపీ నాయకులు. అయితే తీరా ఎన్నికలు వచ్చే సరికి టీడీపీ వైసీపీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. పులివెందులలో అయితే ఒక్క పంచాయితీ కూడా సాధించలేకపోచింది. పైగా పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజికవర్గం అయిన కుప్పంలో కూడా టీడీపీ పట్టునిలుపుకోలేపోయింది.

ఇక చంద్రబాబుకు బామర్ధి ఎమ్మెల్యే బాలయ్యకు కూడా పంచాయితీ ఎన్నికలు చేదు అనుభవమే ఎదురైంది. పంచాయితీ ఎన్నికల ముందు ఒకటికి రెండుసార్లు హిందుపురంలో పర్యటించారు బాలకృష్ణ. అయినప్పటికి కూడా హిందుపురంలో మెజార్టీ స్థానాలు వైసీపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించడం విశేషం. తాజాగా టీడీపీతో పాటు, బాలయ్యకు భారీ షాక్ తగిలింది. హిందుపురంలో కీలకంగా వ్యవహరించే నేత ఒకరు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

హిందుపురం నియోజికవర్గం మొదటి నుంచి కూడా టీడీపీకి అండగా ఉంటు వస్తుంది. అక్కడ ప్రజలు ఎన్టీఆర్ కుటుంబానికి పట్టాభిషేకం చేస్తు వస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో మొదలుకుని ఆయన కొడుకులు అయిన హరికృష్ణ, బాలకృష్ణలు అక్కడ ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ప్రస్తుతం బాలయ్య అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయినప్పటికి కూడా హిందుపురం పంచాయితీని వైసీపీ కైవసం చేసుకోవడం విశేషం. ఇది చాలదున్నట్లు హిందుపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరడం సంచలనంగా మారింది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులును వైసీపీ.. పార్టీలో చేర్చుకుంది. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన తన కుమారులతో సహా వైసీపీలో చేరారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ ఇక్బాల్ ఆయనకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. గతంలో ఆయన హిందుపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. హిందూపురంలో టీడీపీ తరఫున విజయం సాధించిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయనే.

1983లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని అందుకున్నారు. కాని ఆ తరువాత నుంచి ఆయనకు టిక్కెట్ కెటాయించలేదు. అయినప్పటికి కూడా టీడీపీ మీద అభిమానంతో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేశారు. పామిశెట్టి రంగనాయకులు వంటి సీనియర్ నాయకులు పార్టీ వీడితే అది పార్టీకి నష్టమే అని నియోజికవర్గ ప్రజలు చర్చించికుంటున్నారు.