సంచలనంగా మారిన నరసరావుపేట ప్రేమోన్మాది ఉదంతంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నిందితుడ్ని అసలు వొదలొద్దని.. కఠిన శిక్ష పడేలా చేయాలన్న మాటను చెప్పటమే కాదు.. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు. ఈ ఉదంతం గురించి సీఎంవో అధికారుల్ని ప్రత్యేకంగా అడిగిన జగన్.. ‘వాడిని వొదలొద్దు’ అని కీలక వ్యాఖ్య చేసినట్లు చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష.. నరసరావుపేటలోని ఒక ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. అదే కాలేజీలో విష్ణువర్ధన్ రెడ్డి అనే విద్యార్థితో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలానికి అతడి ప్రవర్తన తేడా ఉండటం.. ప్రవర్తన సరిగా లేకపోవటంతో అతడ్ని పక్కన పెట్టింది. ఈ క్రమంలో అనూషపై కోపాన్ని పెంచుకున్న విష్ణు.. తాజాగా వేరే వ్యక్తితో ఆమె చనువుగా ఉంటుందన్న అనుమానంతో ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.

తాజాగా ఆమెను నమ్మబలికి తన బైక్ మీద తీసుకెళ్లాడు. అనంతరం సాగర్ మేజర్ కాలువ వద్ద.. ఆమె గొంతు పిసికి.. చంపేసి ఆమెను కాల్వలోకి పడేశాడు. స్థానికులు డెడ్ బాడీని గుర్తించి.. ఆమె ఐడీ కార్డు సాయంతో వివరాల్ని తెలుసుకున్నారు. నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించి.. పోస్టుమార్టం చేసి.. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

తమ కుమార్తెనుపొట్టన పెట్టుకున్న కుర్రాడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు.. రాజకీయపార్టీలు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. వాడిని అస్సలు వదిలిపెట్టొద్దని.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు.. అనూష కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని ఆదేశించారు.