తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఆ పార్టీ సీనియర్ నేత షాకివ్వనున్నారా..? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీని వీడేందుకు సిద్ధం అయినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకర్తలను కూడా ఆయన కలుసుకోవడం లేదని తెలిసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపుకోసం ఆయన ఎదురు చూస్తున్నట్లు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి పితాని వైసీపీలోకి రావాలనుకుంటున్నారు. అయితే అధికార వైసీపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు పితానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలోనే.. పితానిని పార్టీలోకి తీసుకుంటనేనే కొంతమేర కలిసి వస్తుందని అధికార పార్టీ నేతలు కూడా భావిస్తున్నట్లు తెలిసింది. కాగా పితాని సత్యనారాయణ పార్టీ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే పలువురు టీడీపీ సీనియర్ నేతలు కూడా వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల గ్రామానికి చెందిన పితాని సత్యనారాయణ.. మొదట కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరారు.అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో అచంట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పితానిపై గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకు వైఎస్. జగన్ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. వైసీపీలో చేరితే.. పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పించాలని పితానీ కోరుతున్నట్లు సమాచారం. ఈ అంశంలో జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మాజీ మంత్రి వైసీపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.