అన్ని రాష్ట్రాలు కరోనాతో ఫైట్ చేస్తుంటే.. ఏపీలోని వైఎస్ జగన్ మాత్రం కరోనాతోపాటు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలను కూడా కంట్రోల్ చేసే పనిని పెట్టుకున్నారు. ఆ వేడిలోనే ఈ వేడిని కలిపేసి టీడీపీ నేతల్లోని అక్రమార్కులు, అవినీతి పరుల భరతం పడుతున్నారు.గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష టిడిపి నాయకులను ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి వేటాడేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి..

ఇప్పటికే ఇద్దరు తెలుగుదేశం పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలు లిస్టుల మరింత మంది టీడీపీ నేతలు ఉన్నారని అర్థమవుతోంది. గత ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత అరెస్ట్ అయిన తొలి టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు కావడం గమనార్హం.

ముఖ్యమంత్రి అయిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాలను పున:పరిశీలించడమే కాకుండా, అవకతవకలు జరిగిన శాఖల్లో దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించుకున్నారు. టిడిపి పాలనలో వివిధ పథకాలలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టులు జరగడం విశేషంగా మారింది.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధి సంక్షేమంలో తన మార్క్ చూపి ప్రజల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కడం ప్రారంభించాడు. అభివృద్ధి ముసుగులో చంద్రబాబు, టీడీపీ నేతల అరెస్ట్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన ముగియడంతోనే గేర్ మార్చేశారు. సైలెంట్ గా స్క్కూ బిగిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కుంభకోణాలు చేసిన వారిని అరెస్టు చేయడంపై మీడియా కూడా పూర్తి ఫోకస్ పెట్టింది. జగన్ ఏడాది పాలన వైసిపి వారికి కొన్ని విషయాల్లో ఆయన నచ్చలేదు. అందులో ప్రధానమైనది అధికారాన్ని కోల్పోయినా సరే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అనుబంధ మీడియా వైఖరి మాత్రం మార్చుకోకుండా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి అభాసుపాలు చేస్తూనే ఉన్నాయి. ఇది చూసి చాలా మంది వైసీపీ అభిమానులు కూడా జగన్ పైనే చిటపటలాడుతూ వచ్చారు. ప్రతి చిన్న విషయానికి మీడియా తెలుగుదేశం పార్టీ నేలమీదకు వస్తున్నా అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామని వైసీపీ నేతలు ఇన్నాళ్లు బాధపడ్డారు.

ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సమయం పాలన పైన దృష్టి పెట్టారు. అదే సమయంలో టీడీపీ నేతల అవినీతి చిట్టా ను పకడ్బందీగా సేకరించారు. జగన్మోహన్ రెడ్డి మౌనంగానే టిడిపి పెద్దల కుంభకోణాలు వెలికితీశారు. వీటిని వెలికితీసే విషయంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత తెలివిగా వ్యవహరించారట.. ఏసీబీ, సీఐడీలను రంగంలోకి దింపి వ్యవహారాన్నంతా నడిపారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నేతలు అభివృద్ధి ముసుగులో చేసిన అవినీతిని బయటకు లాగేందుకు నిర్ణయించారు. టీడీపీ నేతలు కేసుల నుంచి తప్పించుకోవడంలో దిట్టలు. సాంకేతిక కారణాలు చూపించి ఎలా తప్పించుకోవాలో తెలుగుదేశం పార్టీ పెద్దలకు బాగా తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డికి ఇంకా బాగా తెలుసు. అలాంటి పార్టీ నేతలపై అవినీతి కేసులు సిద్ధం చేయాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. జగన్ ఈ గ్రౌండ్ వర్క్ ఈ ఏడాదిలో సమర్థవంతంగా పూర్తి చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు

నేరుగా ఫలానా వ్యవహారంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అరెస్ట్ చేస్తే.. అది రాజకీయ కక్ష సాధింపు అని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పించుకునేందుకు అవకాశం ఉండేది. గతంలో ఇదే కోణంలో చంద్రబాబు కేసులపైన స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడా అవకాశం లేకుండా జగన్ మోహన్ రెడ్డి టీడీపీ కీలక నేతల చిట్టాను ముందే సిద్ధం చేయించారు. టిడిపి మంత్రులు పార్టీ పెద్దలు చేసిన అక్రమాలకు సంబంధించి ఈ ఏడాది లో ఏసీబీ ద్వారా ఆధారాలను జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేయించారు. ఇప్పుడు కోర్టులకు వెళ్లిన టీడీపీ నేతలకు ఊరట లభించే అవకాశం లేదని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో నాయకుడు అవినీతిని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను ఏపీ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు పక్కాగా సేకరించాయట.. వాటిని చూసిన తర్వాత టిడిపి నేతలకు కోర్టుల్లో కూడా ఊరట లభించే అవకాశం లేదని వైసిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని కేసులను సీబీఐకి అప్పగించగా.. సిబిఐ అధికారులు సొంతంగా బుర్రలు బద్దలు కొట్టి కోవలసిన అవసరం లేకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఆధారాలు సిద్ధం చేశాయని చెబుతున్నారు. ప్రాథమిక సాక్ష్యాలను సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించగా.. చాలా వ్యవహారాల్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పక్క ఆధారాలని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వ్యూహాన్ని ఫాలో అవడం వల్లే ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టు చేసినా జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ ఇదంతా కక్ష సాధింపు అని ఎదురు కూడా వాదించ లేకపోతోంది.

సామాన్యులకు కూడా టీడీపీ అవినీతి అక్రమాలు అర్ధమయ్యేలా జగన్ ప్రభుత్వం వివరించింది. ఆ తరువాతే అరెస్టులకు ప్రభుత్వం సిద్ధం కావడం వల్ల టిడిపి ఆత్మరక్షణలో పడిపోయింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో గత ప్రభుత్వంలో ఏ వ్యవస్థ తమను ఏం చేయలేదన్న ధైర్యంతో గడిచిన ఐదేళ్లలో చాలా వ్యవహారాల్లో టీడీపీ పెద్దలు మంత్రులు బహిరంగంగానే ప్రజాధనాన్ని వృధా చేశారు. . రాజధాని భూములున్న అమరావతిలో మూడు రెట్లు అధికంగా సొమ్ము చేసుకున్నారు. కాంట్రాక్టర్లకు తాత్కాలిక భవనాలు నిర్మించడంతో పంట పండించారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను అమాంతం పెంచుతూ దోచుకున్నారు. ఇలా చెబుతూ వెళితే ప్రతి శాఖలోనూ విపరీతమైన దుబారా కనిపించింది. ఈ చిత్రం మొత్తం ఈ ఏడాదిలో జగన్ సిద్ధం చేయించారు. ఇప్పుడు ఏ ఫైల్ కదిలించినా ఏదో ఒక టిడిపి నాయకులు గానీ.. మాజీ మంత్రి గానీ కేసులో ఇరుక్కోవడం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ఏడాది మౌనాన్ని చేతగానితనంగా భావించిన టీడీపీ నేతలందరికీ తాను ఇంతకాలం ఎందుకు సైలెంట్ గా ఉన్నాడన్నది ఇప్పుడు అర్థమవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.