ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలిపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని.. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ ను కూడా శాసించేస్థాయిలో నిమ్మగడ్డ తీరు ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏపీ మంత్రులు. ఏపీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. నిమ్మగడ్డ ప్రవర్తించడం ఎన్నికల సందర్భంగా ప్రధానంగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను టార్గెట్ చేస్తూ.. నిమ్మగడ్డ అటు ప్రభుత్వానికి.. ఇటు గవర్నరుకు ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఇందుకు కౌంటర్ గా ప్లాన్ బీ అమలుకు సిద్ధమైంది జగన్ సర్కారు.. ఇందుకోసం ఇప్పటికే మంత్రలను రంగంలోకి దింపింది.

ఇటీవల మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై చేసిన ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారు.. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు శాసన సభా కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని.. తమపై అనవసరపు వ్యాఖ్యలు చేశారని.. ఎస్ఈసీ రమేశ్ కుమార్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక వీరిద్దరి ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ మేరకు నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు తమ్మినేని. స్పీకర్ ఆదేశాల మేరకు.. ప్రివిలేజ్ కమిటీ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పై విచారణ చేపట్టనునుంది. ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏవిధమైన చర్యలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సైతం మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిపై గవర్నర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అంటూ.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మంత్రులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తమపై నిందారోపణలు మోపారని, అవి తమను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఈ వ్యవహారంలో ముందు.. ముందు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న చర్చ ప్రస్తుతం ఏపీలో జోరుగా సాగుతోంది.