రద్దు అయిపోతుందని అనుకుంటున్న శాసన మండలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు నేతలకు ఆశలు రేకెత్తాయి. కాదు కాదు సీఎం జగన్ ఆశలు రేకెత్తిస్తున్నారు. సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్నాళ్ల క్రిందట శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జగన్ సంక్షేమ పథకాల బిల్లులను ప్రజలకు అందకుండా టీడీపీ శాసనమండలిలో అడ్డుకుంది. జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఒకే ఒక లక్ష్యంతో మూడు రాజధానుల బిల్లు సహా.. ఇంగ్లీష్ మీడియం విద్య, ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లులను టీడీపీ శాసనమండలిలో అడ్డుకుంది. అంతే కాదు టిడిపి శాసన మండలి చైర్మన్ రాజధాని బిల్లు విషయంలో చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో వ్యవహరించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని జగన్ నిండు శాసనసభలో ప్రకటించారు. అప్పటికప్పుడు అసెంబ్లీని సమావేశపరిచి శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానం బిల్లును కేంద్రానికి పంపించారు.

సలహాలు చేసే పెద్దల సభగా శాసనమండలి ఉండాలని.. కానీ కీలకబిల్లులను మండలి అడ్డుకుంటోందని.. అందుకే దాన్ని రద్దు చేస్తున్నామని మండలిలో సీఎం జగన్ ప్రకటించారు. కేంద్రానికి మండలిని రద్దు చేసి తీర్మానం పంపించారు. శాసన మండలి రద్దు బిల్లుకు అటు లోక్ సభ.. ఇటు రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. కరోనా-లాక్ డౌన్ తో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్లమెంట్ సమావేశమయ్యే పరిస్థితి లేదు. ఢిల్లీలో బాగా ప్రబలడంతో ఇప్పుడు దేశ ఆరోగ్యం తప్పితే శాసనమండలి రద్దు బిల్లులు చర్చకు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. శాసనమండలి రద్దు ఎలాగో ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. తాజాగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవులను తన పార్టీకి చెందిన నాయకులకు ఇప్పించుకుని శాసన మండలి లో బలం పెంచుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

దీంతో రద్దు అయిపోతుంది అనుకున్న శాసనమండలిలో ఐదుగురు ఎమ్మెల్సీలను కొత్త నియామకం కానుండడంతో వైసీపీలో పదవి సందడి మొదలైంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ శాసన మండలి రద్దు బిల్లు ఆమోదం పొందే వరకు కూడా శాసనమండలి కొనసాగుతోంది. ప్రస్తుతం శాసనమండలి లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్ కోటాలో గతంలో భర్తీ అయిన శాసనమండలి సభ్యులు శ్రీ సత్యనారాయణ రాజు కాలం మార్చితో తన పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారు. అలాగే రత్నాబాయి పదవీకాలం కూడా ముగిసింది. ఆ రెండు స్థానాలను గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వమే అభ్యర్థులను ఎంపిక చేసి గవర్నర్ కు పంపిస్తుంది. అలాగే ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్నికల కమిషన్ అసెంబ్లీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మూడు స్థానాలను త్వరలోనే భర్తీ చేసుకునే అవకాశం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది.

అలాగే ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభకు ఇద్దరు ఎమ్మెల్సీలను జగన్ పంపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు జగన్ పంపిస్తున్నారు. అసెంబ్లీలో వైసీపీ బలం దృష్ట్యా వీరి ఎన్నికల లాంఛనమే. దీంతో ఈ నెలాఖరుకల్లా వీరిద్దరూ కూడా శాసనమండలికి రాజీనామా చేస్తారు. దీంతో ఒకేసారి ఐదు స్థానాలను భర్తీ చేసే అవకాశం జగన్ కు దక్కింది. దాంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు స్థానాలను తన పార్టీ నేతలతో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

గవర్నర్ కోటా ఎలాగో పూర్తిగా ప్రభుత్వ కోట. అలాగే మిగిలిన మూడు స్థానాలు కూడా అసెంబ్లీ లో తిరుగులేని 151 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నందున అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. దీంతో జగన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన పలువురితో వీటిని భర్తీ చేయనున్నారు. ఎన్నాళ్లు శాసనమండలి లైవ్ లో ఉంటే వీరంతా అన్నాల్లు ఎమ్మెల్సీలుగా ఉంటారనే ఉద్దేశంతో జగన్ వీటిని భర్తీ చేయనున్నారు. దీంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదుగురు సభ్యుల ఎంపిక ప్రక్రియను ప్రస్తుతం ప్రారంభించారు. ఎమ్మెల్సీలుగా ఎక్కువ గుర్తింపు ఉన్న వాళ్ళని ఈసారి జగన్ ఎంపిక చేస్తారని తెలిసింది. మూడు స్థానాలకు పార్టీ లో గతంలో హామీ ఇచ్చిన వారితో భర్తీ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 19తో రాజ్యసభ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. ఈ నెలాఖరుకల్లా ఈ ఎమ్మెల్యేలను భర్తీ చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.