ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు నిర్వహించిన భేటి హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో వైఎస్ జగన్ ఏకాంతంగా మాట్లాడినట్టు ప్రచారం సాగుతోంది. అందులో ఏం మాట్లాడారు? వీరి రహస్య భేటి సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం వైయస్ జగన్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు నిర్వహించిన సమావేశం అందరిలోనూ ఆసక్తి రేపింది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై సినీ పెద్దలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీలో ప్రస్తావించారని తెలుస్తోంది. ఈ భేటీకి టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున డైరెక్టర్ రాజమౌళి నిర్మాతలు సి. కళ్యాణ్ డి. సురేష్ బాబు దిల్ రాజు పీవీపీ దామోదర్ ప్రసాద్ లు హాజరయ్యారు.

ఈ సమావేశంలో భాగంగా ఇప్పటికే దేశంలోనే మొదటగా ఏపీ ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇచ్చి సింగిల్ విండో పద్దతిలో అనుమతులు ఇచ్చేలా జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ తరుపున ధన్యవాదాలు తెలియజేసారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సినీ ప్రముఖులు అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఏపీ మంత్రి పేర్ని నాని ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీలో సినీ పరిశ్రమకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారని తెలిపారు. చిన్న సినిమాలకి సంబంధించి సబ్సిడీలు ఏమైతే ఉన్నాయో సీఎం ఆదేశాల మేరకు ఇవ్వడం జరుగుతుందని.. వైజాగ్ లో స్టూడియోలు నిర్మాణం చేసుకుంటే రాయితీలు అందిస్తామని.. భవిష్యత్ లో సినిమా వారికి ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. అంతేకాకుండా నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. జూలై 15 తర్వాత సినిమా షూటింగులు మొదలయ్యేలా విధివిధానాలు రూపొందించామని సీఎం ఆదేశించారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

సీఎం జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తమ ప్రతిపాదనలన్నింటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం జులై 15 నుండి షూటింగులకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఏపీలో కూడా విధి విధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని వెల్లడించారు. అంతేకాకుండా సినీ పరిశ్రమలో సమస్యలతో పాటు టికెటింగ్ విధానంలో మార్పుల గురించి కూడా సీఎంతో చర్చించామని.. మెట్రోపాలిటన్ సిటీస్ అయిన బెంగళూరు చెన్నై ముంబై తరహాలో సినిమాను బట్టి టికెట్ రేటు పెంచే విధానం అమల్లోకి తీసుకురావాలని కోరినట్టుగా చిరంజీవి తెలిపారు. థియేటర్స్ మినిమమ్ ఫిక్స్డ్ పవర్ చార్జెస్ ఎత్తివేయాలని సీఎంని కోరగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా సినిమాలకు ఇచ్చే నంది అవార్డుల గురించి మాట్లాడగా 2019-20 సంవత్సరానికి అవార్డులు ఇవ్వడానికి సీఎం సుముఖుత వ్యక్తం చేసారని తెలిపారు. ముఖ్యంగా వైజాగ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సినీ ఇండస్ట్రీ కోసం వైజాగ్ ప్రాంతంలో కేటాయించిన 300 పై చిలుకు ఎకరాల భూమిలో ఇండస్ట్రీని అభివృద్ధికి కృషి చేస్తామని చిరంజీవి వెల్లడించారు.

ఇక అందరికీ తెలియని విషయం కూడా సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రముఖులతో భేటి తర్వాత సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. విశాఖను టాలీవుడ్ హబ్ గా మార్చడానికి సాయం చేస్తామని.. హీరోలు, నిర్మాతలకు భూములు కేటాయిస్తామని.. స్టూడియోలు నిర్మించి విశాఖను టాలీవుడ్ హబ్ గా మార్చాలని సీఎం జగన్ కోరినట్లు తెలిసింది. ఈ మేరకు సినీ ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి ఒప్పించాలని జగన్ తాజాగా చిరంజీవిని కోరినట్టు తెలిసింది. విశాఖలో భారీగా భూములు స్టూడియోలకు, సినీ ప్రముఖులు నివాసం ఉండడానికి కేటాయిస్తామని.. టాలీవుడ్ తరలిరావాలని జగన్ కోరినట్టు తెలిసింది. ఎలాగైనా విశాఖను టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయువుపట్టుగా మార్చాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలిసింది. అందుకే టాలీవుడ్ పెద్దలకు ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చిరంజీవితో జగన్ భేటి హాట్ టాపిక్ గా మారింది.