ఇటీవల టాలీవుడ్ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించకపోవడంతో వివాదం రూపుదాల్చింది. ఈ విషయంలో బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేయగా, దానికి నాగబాబు ప్రతిస్పందించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్యను యాంకర్ ప్రశ్నించింది. నాగబాబు వ్యాఖ్యలపై ఏమంటారని అడగ్గా… “ఛీ, ఛీ… నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?” అంటూ బదులిచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ ను వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పలేను

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. దీనిపై ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావడం అనేది జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత విషయం అని, అతని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అయినా, జూనియర్ ఎన్టీఆర్ కు నటుడిగా ఎంతో భవిష్యత్ ఉందని, ఈ నేపథ్యంలో, వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పలేనని బాలయ్య స్పష్టం చేశారు. గతంలో తన తండ్రి నందమూరి తారకరామారావు ఏక కాలంలో రాజకీయాలు, సినీ రంగంలో కొనసాగారని, ఇప్పుడు తాను కూడా అదే పంథాలో పయనిస్తున్నానని వివరించారు.

కేసీఆర్ గారికి నేనంటే పుత్ర వాత్సల్యం ఉంది

ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ ప్రముఖులు చర్చలు జరపడం, ఆ సమావేశాలకు అగ్రనటుడు బాలకృష్ణను పిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. కేసీఆర్ గారు ఈ సమావేశాలకు తనను ఎందుకు పిలవలేదో తెలియదని, ఆయనకు తనపై ఎప్పుడూ కోపం లేదని స్పష్టం చేశారు. పైగా, ఎన్టీఆర్ అభిమాని అయిన కేసీఆర్ కు తానంటే పుత్ర వాత్సల్యం ఉందని తెలిపారు. ఈ ఘటనను రాజకీయపరంగా చూడొద్దని పేర్కొన్నారు. గతంలో తాను కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల కారణంగా పిలిచుండకపోతే ఆ విషయమైనా తనతో చెప్పి ఉండాల్సిందని అన్నారు.