కరోనా కారణంగా అన్ని రకాల పరిశ్రమల తో పాటు సినీ పరిశ్రమ కూడా కుదేలు అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు ల నేపథ్యంలో ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిసి ఆయన నుండి సానుకూల స్పందన పొందిన సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో ఏపీ సీఎం జగన్ ని కలవనున్నారు. వివరాల్లోకి వెళితే..

చిరంజీవి నేతృత్వంలో ఏపీ సీఎం జగన్ ని కలవనున్న సినీ పరిశ్రమ పలు అంశాల ను జగన్ దృష్టికి తీసుకు రానున్నది. ఏపీ లో షూటింగ్ అనుమతులు, సింగిల్ విండో అనుమతుల విధానం, రాయితీలు, పరిశ్రమ కి కావలసిన ప్రోత్సాహకాల విషయంలో సీఎం జగన్ తో చిరంజీవి నేతృత్వంలోని చర్చించనుంది. మొన్నామధ్య ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్స్ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడం కోసం జగన్ ప్రభుత్వం సింగిల్విండో విధానాన్ని తీసుకొస్తూ జీవో విడుదల చేయడం, దానికి చిరంజీవి జగన్ కు అభినందనలు తెలపడం తెలిసిందే. పైగా సినీ పరిశ్రమ ఇటీవల జగన్ తో తమ సమస్యల గురించి చర్చించినప్పుడు చిరంజీవిని బాధ్యత తీసుకోవాల్సిందిగా జగన్ సూచించినట్లు సమాచారం.

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమకు కావాల్సిన ప్రోత్సాహకాలు, కరోనా కష్టాలనుండి సినీ పరిశ్రమను గట్టెక్కించడానికి తీసుకోవలసిన చర్యల కొరకు జరగనున్న ఈ సమావేశం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అన్నది వేచి చూడాలి.