గత కొద్దిరోజులుగా సినీ నటుడు చిరంజీవి రాజ్యసభ సీటు గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వైసీపీ నుంచి చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎన్నిక కానున్నారని న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయం నుంచి ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. జగన్ చేస్తున్న పరిపాలనను ప్రశంసిస్తు అనేకసార్లు ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశారు చిరంజీవి. ఇక జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతునిస్తున్నట్లూ కూడా ప్రకటించారు. దీనిలో భాగంగానే జగన్ ఇంటికి వెళ్లి మరి ఆయన్న కుటుంబ సమేతంగా కలిశారు. త్వరలో ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. దీంతో చిరంజీవి వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారని ప్రచారం బాగా జరిగింది. చిరంజీవికి రాజ్యసభ సీటు విషయంలో జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. చిరంజీవి పార్టీలోకి వస్తే బాగుంటుందని జగన్ కూడా భావించారు. తాజాగా చిరంజీవి రాజ్యసభ సీటు గురించి స్పందించారు వైసీపీ ఎంపీ. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వైసీపీ నుంచి చిరంజీవి రాజ్యసభకు వెళ్లనున్నారనే వస్తున్న వార్తలపై స్పందించారు వైసీపీ ఎంపీ రాఘురామరాజు కృష్ణంరాజు. తాజాగా ఆయన ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ చిరంజీవి రాజ్యసభ సీటుపై మాట్లాడారు. చిరంజీవి మళ్లీ రాజ్యసభకు వెళ్తే అత్యంత సంతోషించేవాడిని తానే అని చెప్పుకొచ్చారు. తాను చిరంజీవి మంచి స్నేహితులం అని, గత 20 ఏళ్లుగా మా మధ్య స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారాయన. గతంలో ఆయన రాజ్యసభకు వెళ్లిన అనుభవం కూడా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అనేక నిధులు తీసుకువచ్చారని ఎంపీ రాఘురామరాజు కృష్ణంరాజు తెలిపారు. వైసీపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.

అయితే తమ పార్టీ నుంచి చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నారనే సమాచారం తనకు తెలియదని పెర్కొన్నారు. చిరంజీవికి రాజ్యసభ సీటును ఇస్తే కనుక పవన్ కల్యాణ్‌కు కూడా చెక్ పెట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన సినిమాలతో బిజీగా ఉన్నారు. మళ్లీ రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ఆలోచనలో చిరంజీవి లేరని నేను భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాల్లో నటించే అవకాశం ఉండదు , కాని ప్రస్తుతం చిరంజీవి రెండు , మూడు సినిమాల్లో నటిస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. కాబట్టి ఆయన తిరిగి రాజకీయల్లోకి వస్తారని నేను భావించడం లేదని తెలిపారు వైసీపీ ఎంపీ. ఈ సంర్భంగా తనపై వస్తున్న విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు రాఘురామరాజు కృష్ణంరాజు. తాను ఎప్పుడు కూడా పార్టీ నియమాలను ఉల్లఘించలేదని తెలిపారు. సీఎం జగన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తన వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికే కేంద్ర నాయకులను నిత్యం కలుస్తున్నాననే తప్ప , మరో ఆలోచన తనకు లేదని ఆయన తెలిపారాయన.