జగన్ నిర్ణయాలు అలాగే ఉంటాయి. ఆయన హోం వర్క్ అంతా తన మైండ్ లోనే చేస్తారని చెబుతారు. దానికి తగినట్లుగా సడెన్ గా ఆ నిర్ణయాలను అమలు లో పెడతారు. ఇపుడు కూడా అలాంటి సెన్సేషనల్ డెసిషన్ ఒకటి జగన్ తీసుకోబోతున్నారా అన్నదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో అతి పెద్ద చర్చగా ఉంది.

ఏపీలో మూడు రాజధానుల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఇది హై కోర్టులో ఉంది. కోర్టు తీర్పు వస్తే ఆ మీదట అటో ఇటో మరో పక్షం సుప్రీం కోర్టుకు వెళ్ళడం కూడా ఖాయం. ఈ విధంగా చూసుకుంటే ఎప్పటికి ఈ కధ సెట్ అవుతుందో ఎవరికీ తెలియదు. కానీ జగన్ మాత్రం తన పట్టుదలను అలాగే కొనసాగిస్తున్నారు. విశాఖకు వెళ్ళడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ని ముందుగా విశాఖకు తరలించడానికి ఆయన చూస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ కనుక వెళ్తే అది అసలైన రాజధానిగానే ఉంటుంది. అందువల్ల జగన్ ఈ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అయితే సచివాలయం తో సహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది.

కానీ జగన్ మాత్రం ముందు తన ఆఫీస్ ని తరలించి విశాఖ నుంచే పాలించాలని చూస్తున్నారు. నిజానికి రాజ్యాంగం లో రాజధాని అన్న పదానికి ఎక్కడా సరైన నిర్వచనం ఏదీ లేదని నిపుణులు చెబుతారు. ముఖ్యమంత్రి కానీ ప్రధాని కానీ తాము ఎక్కడ నుంచి పాలిస్తే ఆ నగరమే ముఖ్య పట్టణం అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే జగన్ విశాఖలో కొలువు తీరితే అదే రాజధాని అవుతుంది అనడంలో సందేహం లేదు. మొత్తానికి చూసుకుంటే జగన్ విశాఖ రాజధాని నిర్ణయం ఏపీ రాజకీయాలను పెద్ద ఎత్తున షేక్ చేస్తుంది అని గట్టిగానే చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.