దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని ఎలా నిర్వహించాలన్న అంశంపై సమాలోచనలు మొదలయ్యాయి. వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే వర్చువల్ సాంకేతికత సాయంతో ‘ఈ-పార్లమెంట్’ను నిర్వహించడంపై రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం జరిగిన సమావేశంలో చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో సాధారణ సమావేశాలు సాధ్యంకాకపోవచ్చని, దీంతో కొత్తరకం సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు వెల్లడించాయి. దీంతోపాటు సభ్యుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే రెండు సభల్ని రోజు విడిచి రోజు నిర్వహించే అవకాశాన్ని కూడా చైర్మన్, స్పీకర్.. భేటీలో చర్చించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా జూలై-ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి.
ఈ-పార్లమెంట్’ సమావేశాలు
