ఎన్నికల్లో ఓటమి చంద్రబాబుకు కొత్తేమి కాదు. 1978లో మొదలైన ఆయన గెలుపు, 1983లో తొలిసారి ఓటమి చూసింది. అంటే అయన రాజకీయ జీవితంలో రెండో ఎన్నికలోనే ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో అయన పోటీ చేయలేదు. తిరిగి 1989 నుండి అది కూడా మొదటి సారి గెలిచి రెండోసారి ఓడిపోయిన చంద్రగిరి నుండి కాదు, కుప్పం నుండి. ఈ 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలయ్యింది. ఆ తర్వాత 2004లో, తిరిగి 2009లో కూడా ఓటమిపాలయ్యారు (1985లో పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి స్థానంలో నిలిచిన తర్వాత).

2014లో ఓటమి అంచువరకూ వెళ్ళి గెలిసొచ్చారు. అయితే 2004లో ఆయన ఓడిపోయినప్పుడు 1995 నుండి 2004 వరకూ ఆయన అధికారులతో ప్రభుత్వాన్ని నడుపుతూ పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోలేదనే విమర్శ వచ్చింది. “బాబు మారాల్సిందే” అంటూ పార్టీ నాయకులూ, కార్యకర్తలూ అనేక సమావేశాల్లో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. “అవును, నేను మారాలి. మారుతున్నా” అంటూ చెప్పి 2009 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేశారు. మహాకూటమి ఏర్పాటు చేసి చివరికి ఓడిపోయారు. అప్పుడు ఆయన “మారాలి” అని కాక, “పార్టీ విధానం మారాలి”.

వ్యవసాయాన్ని, రైతులను పట్టించుకోవాలి. సాంకేతికత, వ్యవసాయం రెండూ సమంగా పార్టీ ప్రచారంలో పెట్టాలి” అని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పార్టీ 2014లో గెలిచేందుకు ఉపయోగపడింది. ఈ నిర్ణయం కారణంగానే పార్టీ రైతు ఋణమాఫీ పార్టీ ఎన్నికల్లో ప్రధాన హామీ అయింది. ప్రజలు ఈ హామీని విశ్వసించి ఓటేశారు. అయితే ఇప్పుడు, 2019లో చంద్రబాబు ఓటమిని వింతగానూ, జరగకూడనిదేదో జరిగినట్టుగాను, అసలు ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే లేనట్టుగాను కొందరు వ్యాఖ్యలు చేయడం, మరికొందరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను జంతువులతో పోల్చడం, మూర్ఖులు, వెధవలు, అజ్ఞానులు అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు.

ఇక మూడో రకం అమరావతిలో తయారైంది. ఇంతకు ముందు ఓడినప్పుడు లేని ఓదార్పు యాత్ర ఇక్కడ అమరావతిలో జరుగుతోంది. చంద్రబాబు ఓటమిని, తెలుగుదేశం ఓటమిని ఇప్పుడు అమరావతిలో జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి కారణాలు విశ్లేషించే ప్రయత్నం చిత్తశుద్ధితో జరగడం లేదనడానికి “మీరెలా ఓడిపోతారు బాబూ”, “నువ్వెలా ఓడిపోయావు బాబూ”, “నిన్నెలా ఓడించారు బాబూ”, అంటూ శోకాలు పెడుతున్న ఈ సరికొత్త పద్దతి అమరావతిలోనే చూస్తున్నాం.

ఈ పద్దతి అమరావతిలో రావడం, పార్టీ కూడా అమరావతిలోని ఈ పద్ధతినే తన విధానం అనుకోవడంవల్లనే ఘోర పరాభవం చవిచూడాల్సి వచ్చింది.

నిన్న జరిగిన ఒక సమావేశంలో “బీసీలు, మాదిగలు పార్టీకి దూరం అయ్యారు” అని ఓ చిన్న విశ్లేషణ చేసి ఊరుకున్నారు కానీ, ఇంకొంచెం ముందుకెళ్ళి ఉంటే బీసీలు, మాదిగలే కాకుండా అన్నికులాలు దూరమయ్యారని అర్ధం అయ్యేది. ఎందుకు దూరం అయ్యారు అని విశ్లేషిస్తే 2004, 2009లో ఓటమి తర్వాత ఏం జరిగింది ఇప్పుడు 2019లో ఓటమి తర్వాత ఏం జరుగుతోంది స్పష్టంగా అర్ధం అవుతుంది.

అమరావతి పార్టీని ముంచింది. అంటే అమరావతి నగరం కాదు ఆ నగరం చాటున కమ్ముకున్న కులాభిమానం. ఆ కులాభిమానమే ఇప్పుడు ఓదార్పు రూపంలో వస్తోంది. దానికి పడిపోతే పార్టీ లేవడం కష్టం. ఈ ఓదార్పులు, మీరెలా… అనే సానుభూతి వదిలి పార్టీ ఇప్పటికైనా 2004, 2009 తొమ్మిది నాటి విశ్లేషణ చేస్తే మంచిది. ముఖ్యంగా ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని తప్పుపట్టడం సమంజసం కాదు. ఈ “అమరావతి టైప్” ఓదార్పులు, పరనిందలు ఆపి విశ్లేషణలు మొదలెడితే మంచిది.

“ఎల్లెల్లవో… ఇవన్నీ మాకు తెలుసులేవో…” అంటే పోయేది నాకేం లేదు.